బాలినేనిపై కుట్రలు చేస్తున్న సొంత పార్టీ నేతలెవరు..!?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. నిందలు..ఆరోపణలు భరించలేకపోతున్నానని వాపోయారు. సొంత పార్టీ వాళ్లే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి బంధువు గా..పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేని పై సొంత పార్టీలో కుట్రలు చేస్తుందెవరు. ఇప్పుడు ఇదే వైసీపీలో ప్రధాన చర్చగా మారింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారంటూ కొందరి పైన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేసారు. పార్టీ నాయకత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాలినేని ఆవేదన : బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకాశంలో వైసీపీ ముఖ్య నేతగా ఉన్నారు. జగన్ కోసం మంత్రి పదవిని వదిలేసి కలిసి అడుగులు వేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రి వర్గ విస్తరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించారు. అదే సమయంలో అదే జిల్లాకు చెందిన సురేష్ ను కేబినెట్ లో కొనసాగించటం పైన బాలినేని మనస్థాపానికి గురయ్యారు.

ముఖ్యమంత్రి జగన్ తో భేటీ తరువాత తిరిగి యాక్టివ్ అయ్యారు. కొంత కాలంగా జిల్లాలోనూ తన పైన పార్టీలో కొందరు వ్యతిరేకంగా పని చేస్తున్నారని బాలినేని వాపోయారు. తాజాగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి బాలినేని రాజీనామా తో మరోసారి చర్చ మొదలైంది. అయితే, ఇప్పుడు బాలినేని చేసిన వ్యాఖ్యలతో అసలు ఆయన చెబుతున్న కుట్రదారులు ఎవరనే చర్చ మొదలైంది.
కుట్ర చేస్తుందెవరు : ముఖ్యమంత్రితో పాటుగా ఇదే జిల్లాకు చెందిన పార్టీలోని మరో ముఖ్య నేతతో బాలినేని బంధుత్వం ఉంది. జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఇద్దరూ కలిసే పార్టీ కోసం పని చేసారు. కానీ, కొంత కాలంగా ఈ ఇద్దరు ముఖ్య నేతల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఒక ప్రముఖ ధార్మిక సంస్థకు కీలక బాధ్యతలు వహిస్తున్న ఆ నేత పైనే ఇప్పుడు పరోక్షంగా బాలినేని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
2019 ఎన్నికల సమయంలో టికెట్లు ఇప్పించే క్రమం నుంచి ఇద్దరి మధ్య క్రమంగా దూరం పెరుగుతూ ఇప్పుడు ఈ స్థాయికి చేరిందది. జిల్లా పాలనా వ్యవహారాలతో పాటుగా ఎమ్మెల్యేలు ఎవరు ఎవరి వర్గంలో ఉన్నారనే చర్చ ఇప్పుడు జిల్లాలో పార్టీలో మొదలైంది. 2024 ఎన్నికల్లో తిరిగి మాజీ ఎంపీ బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నారు. ఆయనకు అవకాశం లేకుండా బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారనేది మాజీ ఎంపీ వర్గం ఆరోపిస్తోంది.

సీఎం నిర్ణయం ఏంటి : బాలినేని..మాజీ ఎంపీ మధ్య ఆధిపత్య పోరు ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా మారుతోంది. ప్రస్తుత మంత్రి కూడా మాజీ ఎంపీకి మద్దతుగా నిలుస్తున్నారనే ప్రచారం ఉంది. మాజీ ఎంపీ తీరు పైన బాలినేని నేరుగా ఈ మధ్య కాలంలోనే సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికీ తన పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారంతో మనస్థాపానికి గురైన బాలినేని రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఒక సమయంలో తాను టికెట్లు ఇప్పించిన వాళ్లు కూడా ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారని బాలినేని వాపోయారు. బాలినేని సీనియర్ నేతగా ఉంటూ కన్నీరు పెట్టుకొని తన ఆవేదన తెలియ చేయటం పార్టీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పుడు బాలినేని వ్యాఖ్యలు..ఒంగోలు రాజకీయంపై సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.












Click it and Unblock the Notifications