సర్వేల మొగ్గు వైసీపీకి- బీజేపీ మొగ్గు టీడీపీకి- అసలు కారణమిదే ?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో జాతీయ స్ధాయిలో ఈ మధ్య కాలంలో వెలువడిన ప్రతీ సర్వే కూడా అధికార వైసీపీకే మొగ్గు చూపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఎంపీ సీట్లలో దాదాపు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సర్వేలు తేల్చిచెప్పేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఉండి ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ మాత్రం రాష్ట్రంలో వైసీపీ కంటే టీడీపీ-జనసేనవైపు మొగ్గుచూపుతోంది. దీనిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి విజయం సాధించే అవకాశాలున్నప్పుడు, ఇప్పటికే కేంద్రంలో ఎన్డీయే సర్కార్ పూర్తిస్ధాయిలో అండగా నిలుస్తున్నప్పుడు కాషాయ దళానికి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకొస్తోందనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అయితే కేంద్రంలో చక్రం తిప్పుతున్న మోడీ-షా ద్వయం మాత్రం వేరే లెక్కలు వేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా ఏపీలో పరిస్దితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ రిపోర్టులు తెప్పించుకుంటున్న వీరిద్దరూ కొత్త లెక్కల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

వీటి ప్రకారం వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు వారికి అందుతున్నాయి. అదే సమయంలో రాష్ఠ్రంలో వైసీపీతో కలిసి పోటీ చేసే పరిస్దితులు లేవు. బీజేపీతో కలిసి నేరుగా పోటీ చేసేందుకు కానీ, పొత్తు పెట్టుకునేందుకు కానీ వైసీపీ మొగ్గు చూపడం లేదు. ఇదే కారణంతో కేంద్రంలోనూ చేరేందుకు ససేమిరా అంటోంది. మంత్రి పదవులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఆశ చూపినా వైసీపీ మాత్రం మౌనంగానే ఉంటోంది. ఎలాగో మద్దతిస్తున్నాం కదా ఇంకా పదవులు ఎందుకని ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ వైసీపీతో పొత్తు పెట్టుకోలేని పరిస్దితుల్లో బీజేపీ తనదారి తాను చూసుకోక తప్పని పరిస్దితి. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నా ఆ పార్టీతో ఏమాత్రం ఉపయోగం లేదని తేలిపోతోంది. దీంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో మరోసారి పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా.. టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఇక్కడ విజయాలు సాధించిన చరిత్ర బీజేపీకి ఉంది. దీంతో మరోసారి సర్వేల్ని కాదని బీజేపీ.. టీడీపీతో పొత్తు కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications