67 ఏళ్ళలో సీఎం పదవా, బాబు వస్తే జాబులు పోయాయి, చట్ట విరుద్దం: రోజా
67 ఏళ్ళు వచ్చినా మీరు ఏ విధంగా సిఎం పదవిలో కొనసాగేందుకు అర్హులంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.
అమరావతి: 67 ఏళ్ళు వచ్చినా మీరు ఏ విధంగా సిఎం పదవిలో కొనసాగేందుకు అర్హులంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 ఏళ్ళు దాటిన ఉద్యోగులను తొలగించాలనే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో రోజా చంద్రబాబునాయుడుపై టిడిపిపై నిప్పులు చెరిగారు.
టిడిపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ, ఇదే తరహలో ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని బాబుపై వైసీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు.
ఈ. అంశాన్ని వైసీపీ ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రధానంగా అధికారపార్టీకి నష్టం కల్గించే అవకాశం ఉంటుందని విపక్షం భావిస్తోంది.

67 ఏళ్ళు వచ్చాయి సీఎం పదవెందుకు?
50 ఏళ్ళు దాటిన ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రతిభ ఆధారంగా వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలనే అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం ఉందని వార్తలను ప్రస్తావిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. 67 ఏళ్ళ వయస్సులో చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ ఆమె ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తోందనే ప్రచారాన్ని ఆమె ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు పోతోందని ఆమె వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

బాబు కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి
చంద్రబాబు అధికారంలోకి వస్తే కొత్తగా ఉద్యోగాలు రాలేదు,. ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొంది.అయితే లోకేష్‌కు మంత్రి పదవి దక్కిందన్నారు. చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్నారు. జాబులు బాబు కుటుంబానికే దక్కాయని ఆమె చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబునాయుడు చెలగాటమాడుతున్నారని ఆమె ఆరోపించారు.

చంద్రబాబు ఫెర్పార్మెన్స్ పూర్
కొత్త రాష్ట్రం అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే రాష్ట్రం బాగుంటుందని భావించిన ఏపీ ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారని రోజా అన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల ఫెర్పార్మెన్స్ చూస్తామని అంటున్నారు. చంద్రబాబు ఫెర్పార్మెన్స్ అంత గొప్పగా ఏమీ లేదని ఆయన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ఫెర్పార్మెన్స్ పూర్‌గా ఉందని ఆమె సెటైర్లు వేశారు.

ఆ నిబంధన చట్టవిరుద్దం
30 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం ప్రభుత్వ సర్వీసుల్లో ఉండకూడదనే నిబంధన చట్టవిరుద్దమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications