వినాయక చవితికేనా కోవిడ్ నిబంధనలు-ఈ సలహాలు ఎవరిస్తున్నారు-జగన్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్
వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇదే అంశంపై మరోసారి స్పందించారు.గణేశ్ ఉత్సవాలపై నిషేధం ఎందుకు విధించారో నిజంగా తనకు అర్థం కావడం లేదన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతి సంప్రదాయాలు, ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు, పండగలకు, పబ్బాలకు వర్తించవా? అని ప్రశ్నించారు.

దేనిపై దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలి...
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామంటే మాత్రం కోవిడ్ నిబంధనలు గుర్తొస్తాయా? కోవిడ్ నిబంధనలు దేనికి వర్తిస్తాయి? దేనికి వర్తించవు అనేది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే డిసైడ్ చేస్తోంది. పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే ఏపీలో మాత్రం పండుగే చేసుకోవద్దని చెప్పడమేంటి.గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలి. భారతదేశంలో ఏ పని మొదలుపెట్టినా ముందుకు నమస్కరించేంది గణపతికేనన్న సంగతి మర్చిపోతే ఎలా. విఘ్నాధిపతికి నమస్కారం చేసుకొనే ఏ పనైనా మొదలుపెడతాం. అలాంటి గణపతి పండగను జరుపుకోవద్దు అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరు
గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేసినా, రథాలను కాల్చేసినా, శ్రీరాముడి విగ్రహానికి తలతీసేస్తే ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. వారిని పట్టుకోకపోగా, కొత్తగా వినాయక చవితి జరుపుకోవద్దు అని నిబంధనలుపెట్టడం దేనిని సూచిస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరు. దేని మీద దాడి చేస్తున్నారో అర్ధమవుతుందా?. ఒక్కసారి వైసీపీ పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. ఎవరి సలహాలు ఎలా ఉన్నా.. వినాయక చవితిపై విధించిన ఆంక్షలు వెంటనే వెనక్కి తీసుకోవాలి పక్క రాష్ట్రాలు ఎలాంటి పరిమితులతో అనుమతులు ఇచ్చాయో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పరిమితులతో అనుమతులు ఇవ్వాలి.ఇది విశ్వాసానికి సంబంధించినది కాబట్టి అలా ఇస్తేనే మంచిది. జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది ఇంతకుమించి గొడవ చేయకుండా ఇప్పటికైనా అనుమతులు ఇవ్వండి.' అని ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదు గానీ
రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితి కళ్లకట్టినట్టు తెలిపారు. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన రోడ్ల దుస్థితిపై మాట్లాడాలి. సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం అన్న చందంగా జగన్ ప్రభుత్వం పరిస్థితి ఉంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు మెజార్టీ శాతం ప్రైవేటుపరం అయిపోయాయి... ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ప్రతి పెద్ద పోర్టు కూడా ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉంది. అక్కడ బెర్తులు నిర్మించాలన్న, అభివృద్ధి చేయాలన్నా వాళ్లు చూసుకుంటారు. వాటి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామ మాత్రమే. ఎయిర్ పోర్టులు కూడా దాదాపు ఎయిర్ పోర్టు అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తాయి.. లేదా ప్రైవేటు సంస్థలు నడుపుతాయి. అక్కడ రన్‌వేలు వాళ్లు చూసుకుంటారు. అంతే తప్ప రాష్ట్రప్రభుత్వానికి ఏం సంబంధం. ముందు రాష్ట్రంలోని రోడ్లపై దృష్టి పెట్టాలి.' అని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.

రోడ్లు బాగా లేక వైసీపీ నేతలు తిరగడం మానేశారు..
రోడ్ల దుస్థితిపై చేస్తున్న సమీక్షలో ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు చేర్చడం నవ్వు తెప్పించే అంశం. ప్రజల వద్ద వసూలు చేస్తున్న ట్యాక్సులు, సెస్‌లు ఎక్కడికి వెళ్తున్నాయి.రోడ్ల అభివృద్ధికి వెళ్లాల్సిన నిధులు ఏ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. రోడ్లు బాగాలేక వైసీపీ లీడర్లే ప్రజల వద్దకు వెళ్లడం లేదు. మంత్రులు చెప్పినట్టు అద్భుతాలే చేసిందీ ప్రభుత్వం.. చిన్న గోతులను పెద్ద గొయ్యిలుగా... గొయ్యిల్ని కాలువలుగా మార్చేశారు. ఇంత సమస్య ఉంటే.. వచ్చే వర్షాకాలం నాటికి రోడ్లు వేస్తామంటూ మరో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. అదేదో గత అక్టోబర్‌లోనే చేసి ఉండొచ్చు కదా. రోడ్లు సమస్య కొత్తగా ఇప్పుడొచ్చింది కాదు... నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినప్పుడే రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో చూశాను. గ్రామాల్లో లింకు రోడ్లు చూస్తే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతుంది. రోడ్లు మృత్యుద్వారాలుగా మారాయి.జనాలను చంపడానికి రెడీగా ఉన్నాయి. బండి పది కిలోమీటర్లు వెళ్లొస్తే చాలు రిపేరు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకోవాలి. అక్టోబర్ నెలలో టెండర్లు పిలుస్తామంటున్న ముఖ్యమంత్రి... పాత బకాయిల సంగతేంటి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ నుంచి ఎలా పనులు మొదలుపెడతారో చూద్దాం. మా పోరాటం ఆగదు... ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం.' అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications