అసలు సమైక్యవాదెవరో: సబ్బం, లగడపాటి ప్రేమ-ద్వేషం
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు నిజమైన విభజనవాదో తెలియని పరిస్థితి ఉందని, అసలైన విభజనవాది ఎవరో తెలుసుకునేందుకు లై డిటెక్టర్ పెట్టాలేమోనని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సబ్బం హరి ఆదివారం అన్నారు. ఎపి జర్నలిస్టుల ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీలు హర్ష కుమార్, రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబ్బం మాట్లాడారు. విభజనపై అధిష్టానం ఇంత దూకుడుగా ఎందుకు వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజల కోసం కాకుండా రాజకీయాల కోసం విభజిస్తున్నారని ఆరోపించారు. కానున్న ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పరిస్థితిని అందరూ గుర్తించాలన్నారు. కాంగ్రెసు ఎన్డీయే కంటే చాలా వెనుకబడి ఉందన్నారు.

రాష్ట్ర విభజన కోసం కాంగ్రెసు పార్టీ ఇంత రాజకీయ క్రీడ ఆడాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజన జరుగుతోందని చెబుతున్నప్పటికీ సీమాంధ్రకు ఏం కావాలో ఎందుకు అడగడం లేదని విలేకరి ప్రశ్నిస్తే... తాము విభజన వద్దంటున్నామని, అలాంటప్పుడు ఏం కావాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కొందరు సమైక్య ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం విభజన జరిగితే సాఫీగా సాగిపోయేదేమోనని అన్నారు.
లగడపాటి ప్రేమ - ద్వేషం సూత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుతో చేయి కలపడంపై లగడపాటి స్పందిస్తూ.. ద్వేషించడం, విమర్శలు చేయడం విభజనవాదుల లక్షణాలని, ప్రేమించడం, కలుపుకు పోవడం సమైక్యవాదుల లక్షణమన్నారు.












Click it and Unblock the Notifications