YS Jagan: ఒక్క మాటతో తేల్చేసిన జగన్- ఏపీలో తీవ్ర చర్చ..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఓటర్లు తాము ఎవరికి ఓటేయాలో డిసైడ్ అయిపోయారు. అయితే హోరాహోరీ పోరు సాగుతున్న నియోజకవర్గాల్లో ఆధిక్యం కోసం వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చివరినిమిషంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై సొంత లెక్కల్ని ఇచ్చేసాయి. ఈ తరుణంలో సీఎం జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి.
రాష్ట్రంలో ఎన్నికల వేళ వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు పాదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందంటూ నిన్న బందరు సభలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పథకాల నిధుల విడుదలకు బ్రేకులు, డీజీపీ సహా కీలక అధికారుల బదిలీలు అధికార వైసీపీలో రేపుతున్న కల్లోలానికి సీఎం జగన్ వ్యాఖ్యలు అద్దం పట్టాయి. అదే సమయంలో విపక్షాలు కూడా దీనిపై చర్చించుకుంటున్నాయి.

ఇన్నాళ్లూ వైనాట్ 175 అంటూ క్యాడర్ లో ఉత్సాహం నింపిన జగన్.. ఇప్పుడు ఎన్నికల వరకూ వచ్చేసరికి పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం లేదని చెప్పేయడంపై సొంత పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా చర్చించుకుంటున్నాయి. జగన్ నోటి నుంచి ఇంత కీలక సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలకు జగన్ వ్యాఖ్యలు అద్దం పట్టేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఇవాళ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ డీజీపీ బదిలీ సహా ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు కూటమికి మేలు చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు ఈసీకి విపక్షాలపై ఫిర్యాదులు చేసే విషయంలో ముందుంటున్న మల్లాది విష్ణు ఇలా బహిరంగంగానే ఈసీ నిర్ణయాల్ని తప్పుబట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఈసీ సాయంతో పథకాల నిధుల విడుదలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం చూస్తుంటే వాస్తవ పరిస్ధితి అర్థమవుతోంది.
మరోవైపు విపక్షాలు మాత్రం జగన్ వ్యాఖ్యలతో వైసీపీ ఓటమి తేలిపోయిందని ప్రచారం చేసుకుంటున్నాయి. గత ఎన్నికల సమయంలో తమకు పూర్తి స్దాయిలో అండగా ఉన్న ఈసీ.. ఈసారి మాత్రం విపక్షాలకు సహకరించడం అధికార పక్షానికి మింగుడు పడని అంశమే. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా తాము అనుకున్న విధంగా రాష్ట్రంలో ఏదీ జరగడం లేదని ఇన్నాళ్లు నిరాశలో ఉన్న విపక్షాలకు జగన్ వ్యాఖ్యలు ఊరటనిచ్చేలా ఉన్నాయని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications