వై నాట్ 175... నేడు జగన్ నేతలకు దిశానిర్దేశం; వర్కవుట్ అవుతుందా?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలతో పోరుకు సిద్ధం అంటున్నారా? ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల కంటే అభ్యర్థుల ఎంపికలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ముందు వరుసలో ఉన్న జగన్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? ఒకపక్క సిద్ధం సభలతో పాటు, మరోపక్క అంతర్గత భేటీలతో పక్కా ప్రణాళికతో ఎన్నికలకు వెళ్తున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం కోసం ఆయన నేడు వైసీపీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో ఈ మీటింగ్ జరగబోతుంది.

ఇక ఈ సమావేశానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నేతలు హాజరుకానున్నారు. వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు 2000 మందికి పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్ లకు సీఎం జగన్ ఎన్నికలలో క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేయనున్నారు.
వివిధ జిల్లాల్లో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించుకొని, పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఆయన నేడు పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేయనున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని జగన్ సూచనలు చేయనున్నారు. నేడు ఉదయం 9:30 నుండి ప్రారంభం కానున్న ఈ అంతర్గత సమావేశంలో సీఎం జగన్ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు బూస్ట్ ఇచ్చి పంపనున్నారు.మళ్ళీ అధికారమే లక్ష్యంగా ఆయన క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులపైనా ఎన్నికల బాధ్యతను పెట్టనున్నారు.












Click it and Unblock the Notifications