చంద్రులు రాష్ట్రాలు మారుతున్నా! జగన్ ఏపీలోనే ఉంటున్నా ! అంతా కాషాయ వ్యూహమేనా ?
మరో ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి కోసం ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. వీటి లక్ష్యం ఆయా ఎన్నికల్లో గెలుపే కావాల్సి ఉంది.కానీ ఆయా పార్టీల అధినేతలు మాత్రం అంతకు మించిన సమీకరణాలపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్, చంద్రబాబు తమ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలపై దృష్టిపెడుతుంటే, వైఎస్ జగన్ మాత్రం ఏపీకే పరిమితం అవుతానని చెప్పేస్తున్నారు. అయితే వారిద్దరు ఎందుకుజాతీయ స్ధాయిలో దూకుడుగా వెళుతుంటే, ఈయన మాత్రం స్వరాష్ట్రానికే పరిమితమవుతున్నారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

చంద్రబాబు తెలంగాణ వ్యూహాలు
ఎప్పుడో తెలంగాణలో రాజకీయం బంద్ చేసి ఏపీలో విపక్షనేతగా సెటిలైన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే తెలంగాణలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. పార్టీ క్యాడర్ ఎప్పుడో చెల్లాచెదురైపోయినా, నేతలంతా ఇతర పార్టీలకు వలసపోయినా ఏమాత్రం పట్టించుకోకుండా ఉండిపోయిన చంద్రబాబు ఇప్పుడు అంతా బావుందన్న రీతిలో తెలంగాణలో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. దీంతో చంద్రబాబు పార్టీ టీడీపీకి తెలంగాణలో సానుకూలంగా కనిపిస్తోంది ఏంటన్న చర్చ జరుగుతోంది. అలాగే అటు కేసీఆర్ తో కానీ, ఇటు ఆయనతో పోరాడుతున్న బీజేపీ నేతలతో కానీ చంద్రబాబుకు సత్సంబంధాలు లేకపోయినా ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు చర్చనీయాంశంగా మారుతోంది.

ఏపీలో కేసీఆర్ వ్యూహాలు
తెలంగాణలో సొంత పార్టీ టీఆర్ఎస్ ను వరుసగా రెండుసార్లు గెలిపించి తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్ని వరుసగా చావుదెబ్బ కొట్టారు. అయితే ఇప్పుడు అవే రెండు పార్టీలతో పోరాడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనతో స్వరాష్ట్రం తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు జాతీయ పార్టీని తెరపైకి తెచ్చారు. అంతే కాదు తనను ఎలా రిసీవ్ చేసుకుంటుందో కూడా తెలియని ఏపీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. ఏపీలో ఏ పార్టీతో కేసీఆర్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందో ఊహించడం కూడా కష్టంగా ఉంది. అయినా కేసీఆర్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. దీంతో కేసీఆర్ వ్యూహాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

జగన్ ప్రాంతీయ వ్యూహం
మరోవైపు విభజన తర్వాత తెలంగాణను కాదనుకుని ఏపీకి వచ్చి రాజకీయాలు మొదలుపెట్టిన వైఎస్ జగన్.. గత ఎన్నికల్లో అధికారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది. దీంతో జగన్ కూడా పటిష్టంగా కనిపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్దితుల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ వంటి వారు ఇతర రాష్ట్రాలపై దృష్టిపెడుతున్నారు. కానీ జగన్ మాత్రం ఏపీకే పరిమితం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో జగన్ ఇతర రాష్ట్రాలపై ఎందుకు ఆసక్తిచూపడం లేదనే చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆయన సోదరి షర్మిల అన్నతో విభేదిస్తున్నట్లు చెప్పుకుని తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టారు. దీంతో జగన్ తాము ఏపీలోనే రాజకీయాలు చేస్తామని స్పష్టత ఇచ్చేశారు. తెలంగాణలో గతంలో కొన్నిస్ధానాలు గెలిచిన చరిత్ర ఉన్నా ఇప్పుడు తెలంగాణ అంటేనే అంటీముట్టనట్టుగా ఉండిపోతున్నారు. దీంతో జగన్ వ్యూహాలపైనా చర్చ జరుగుతోంది.

కాషాయ వ్యూహాలే పనిచేస్తున్నాయా ?
తెలంగాణలోనే రాజకీయాలు చేసుకుంటున్న కేసీఆర్.. జాతీయ పార్టీ పేరుతో బీజేపీని ఎదుర్కొనే పేరుతో అసలేమాత్రం బలం లేని ఇతర రాష్ట్రాల్లో అడుగుపెడుతున్నా, ఎప్పుడో తెలంగాణ రాజకీయం వదిలేసి ఏపీకి పరిమితం అవుతున్న చంద్రబాబు తిరిగి తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నా, రాష్ట్రం దాటే అవకాశం ఉన్న జగన్ ఏపీకే పరిమితం అవుతున్నా అందులో కాషాయ వ్యూహాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జాతీయ స్ధాయిలో కాస్తో కూస్తో రాజకీయాలు చేసే ఓపిక, వ్యూహాలున్న కేసీఆర్, చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో ఎంట్రీలు, రీఎంట్రీలు ఇస్తుంటే, తొలిసారి అధికారం రుచిచూసిన జగన్ ప్రస్తుతానికి ఏపీకి పరిమితం అవుతున్నా దాని వెనుక బీజేపీ ఉందన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ బూచితో జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్, బీజేపీతో కలిసి రేపు తెలంగాణలో పోటీకి చంద్రబాబు సిద్దమవుతున్నా, బీజేపీకి ఏమాత్రం అవకాశాలు లేని ఏపీలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నా, జగన్ కు అవకాశం లేని తెలంగాణలో షర్మిలతో ఎంట్రీ ఇప్పించినా అందులో బీజేపీ చక్రవ్యూహమే ఉందన్న ప్రచారం జరుగుతోంది.అయితే ప్రజలు వీరిని ఏమేరకు ఆదరిస్తారన్నది కాలమే సమాధానం చెప్పాలి.












Click it and Unblock the Notifications