సర్వే చెప్పని విషయం: జగన్‌ను వెంటాడుతున్నదేమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని సిఎంఎస్ సర్వే తేల్చింది. రెండేళ్లనుండి అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైందని తేల్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు కూడా రాజకీయంగా పెద్దగా పుంజుకోలేదని, ప్రజల మద్దతు సంపాదించుకోవటంలో ఆ పార్టీ కూడా విజయం సాధించలేకపోతోందని అభిప్రాయపడింది.
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మద్దతు కూడగట్టుకోకపోవడానికి కారణాలను చాలా వరకు సర్వే తేల్చింది. కానీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో ఎందుకు విఫలమైందనేది సర్వే తేల్చలేదు. ప్రజా మద్దతు కూడగట్టుకో వడంలో విఫలం కావడం కూడా ఆశ్చర్యకరమైన విషయమే.
నిజానికి, అధికార పార్టీకి మద్దతు తగ్గుతున్న కొద్దీ ప్రతిపక్షం బలం పుంజుకుంటూ ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా జరగడం లేదని సర్వేను బట్టి అర్థమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం పుంజుకోకపోవడానికి వైయస్ జగన్ రాజకీయ వ్యూహరచన కారణమా అనేది ఓ ప్రశ్న.

జగన్‌ను గతం వెంటాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాల కారణంగా ఆయనను ప్రజలు నమ్మకపోవడం కూడా ఓ కారణం కావచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అంతా సుఖమయంగా, స్వర్ణయుగంగా ఉందని వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ అలా లేదనేది అనుభవంలో ప్రజలు తెలుసుకున్నారని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో అక్రమాలు, అవినీతి పెచ్చరిల్లిందంటూ ప్రచారం చేస్తూ, దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో తెలుగుదేశం పార్టీ సఫలం కావడం వల్ల కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుంజుకోకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. అదే విధంగా, వైయస్ జగన్ కేసుల విషయాన్ని తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది.
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)ల పేరుతో రైతుల భూముల స్వాధీనం వంటి పలు అంశాలు ప్రజల్లో వ్యతిరేక భావనలు కలగడానికి కారణమని అంటున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి ప్రజాకర్షక ఫలితాలు వైయస్ పాలనకు మంచి పేరునే తెచ్చాయి. కానీ, అంతకు మించిన వ్యవహారాలను క్రమంగా ప్రజలు అర్థం చేసుకున్నారని అంటున్నారు.
అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. వ్యక్తిగతంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నయమనే భావన ప్రజల్లో ఉండవచ్చు. సర్వేలో చంద్రబాబు వ్యక్తిత్వానికి మంచి మార్కులే వచ్చాయి. అదే సమయంలో అనుభవం కూడా ఓ అంశంగా ముందుకు వస్తోంది.
జగన్ అనుభవరాహిత్యం, ఏకపక్ష ధోరణి కూడా ప్రజామద్దతును కూడగట్టుకోవడానికి ఆటంకంగా మారి ఉండవచ్చునని అంటున్నారు. ప్రజా మద్దతును కూడగట్టుకోవడానికి ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పటికీ తగిన ఫలితాలు రాకపోవడానికి కారణం అదేనని అంటున్నారు. అనుభవాన్ని కూడా ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారని అనుకోవచ్చు.












Click it and Unblock the Notifications