పిఠాపురం వెళ్లినా పవన్ ను టచ్ చేయని జగన్ - స్ట్రాటజీ ఏంటి?
ఏపీలో గత వైసీపీ పాలన నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకూ పవన్ కళ్యాణ్ పై సీఎంగా ఉన్న వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేసేవారు. జగన్ విమర్శలు చూసి ఆయన కేబినెట్లోని కాపు మంత్రులు కూడా సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన కంటే ఎక్కువగా పవన్ పై విమర్శలు గుప్పించేవారు. చివరకు పవన్ ను తిట్టిన మంత్రులంతా ఓటమిపాలయ్యారు. అంతే కాదు గతంలో వైసీపీకి అండగా నిలిచిన కాపు ఓటు బ్యాంకు కూడా పవన్ ప్రభావంతో ఆ పార్టీకి పూర్తిగా దూరమైంది. దీంతో జగన్ కూడా రూటు మార్చినట్లు తెలుస్తోంది.
తాజాగా పిఠాపురంలో ఏలేరు వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన వైఎస్ జగన్.. స్థానిక ఎమ్మెల్యే అయిన పవన్ కల్యాణ్ ను విమర్శించే సాహసం చేయలేదు. ఏలేరు వరదలకు చంద్రబాబే కారణమంటూ తీవ్ర విమర్శలు చేసిన జగన్.. పవన్ ను మాత్రం పల్లెత్తుమాట అనలేదు. దీంతో ఎప్పుడూ పవన్ పై దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్లంటూ విరుచుకుపడే జగన్ ఈసారి మాత్రం ఆయన గురించి మాట్లాడేందుకు ఎందుకు ఆసక్తిచూపలేదనే చర్చ జరుగుతోంది.

అయితే పవన్ గురించి జగన్ ఒక్క మాట మాత్రం అన్నారు. ఆయన ఆర్టిస్టు కానీ చంద్రబాబు డ్రామా ఆర్టిస్టు అన్నారు. దీంతో జగన్ వ్యూహాత్మకంగానే పవన్ ను ఇగ్నోర్ చేశారా అన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి జగన్ పిఠాపురం వెళ్లారంటే కచ్చితంగా పవన్ ను టార్గెట్ చేస్తారని అంతా భావించారు. జనసేన నేతలు కూడా అందుకు ప్రిపేర్ అయిపోయారు. కానీ జగన్ పవన్ ను తిట్టకుండా కేవలం చంద్రబాబునే టార్గెట్ చేసి వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక అవే కౌంటర్లు వేసేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ బరిలోకి దిగడంతో ఆయన్ను టార్గెట్ చేసేందుకు కాపు నేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నేతల్ని కూడా జగన్ ప్రయోగించారు. కానీ అవన్నీ విఫలం కావడంతో పాటు కాపుల్ని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇదే ఎన్నికల్లో వైసీపీని ముంచిందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి ఏలేరు వరదల పరిశీలన పేరుతో పిఠాపురానికి వచ్చినా పవన్ గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications