భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య..!
నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. భార్యాభర్తల మధ్య కొనసాగిన విభేదాలు, మనస్పర్థలు చివరకు.. భర్తను దారుణంగా హత్య చేసే వరకు దారితీశాయి. అయితే ఓ వైపు క్షణికావేశంలో జరిగిన ఘటనగా.. మరో వైపు పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా ఈ దుర్ఘటన పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాకు చెందిన రమనయ్య (50)కు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రవనమ్మతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాల్లోనూ గొడవలు, తగాదాలు పెరిగిపోతుండటంతో... వారి మధ్య గ్యాప్ ఇంకొంచెం పెరిగింది.

పక్కా ప్లాన్‌తో హత్య?
ఈ పరిస్థితుల్లోనే రమనయ్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన రవనమ్మ.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి తీసుకురావడానికి రమనయ్య పిడుగురాళ్లకు వెళ్లగా.. అదే సమయంలో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలోనే రవనమ్మ తన తమ్ముడితో కలిసి భర్త రమనయ్యపై దాడికి పాల్పడింది.
దాడిలో రమనయ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం భర్త మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నంద్యాల జిల్లా నూనెపల్లెలోని వారి ఇంటి వద్ద పడేసి ఆ తర్వాత రవనమ్మ అక్కడినుంచి పరారైనట్టు తెలుస్తోంది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రవనమ్మ, ఆమె తమ్ముడిని అనుమానితులుగా గుర్తించి, వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ కలహాలు ఇంతటి దారుణ హత్యకు దారితీయడం స్థానికంగా విషాదం నింపింది. కాగా ఈ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని భావిస్తున్నారు. మొత్తానికి క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వరుస ఘటనల నేపధ్యంలో భర్తలకు రక్షణ లేదా అని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications