సీపీఎస్ పై రూటు మార్చిన ఏపీ ఉద్యోగులు ! హైకోర్టు ద్వారా సర్కార్ పై ఒత్తిడి ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన సీపీఎస్ రద్దు డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. వారం రోజుల్లో దీన్ని రద్దు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక అప్పట్లో తెలియక హామీ ఇచ్చామని సజ్జలతో చెప్పించేశారు. దీంతో ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఇన్నాళ్లూ సీపీఎస్ రద్దు కోరుతూ పోరాటాలు చేశారు. వీటితో ఫలితం లేదని భావించారో ఏమో ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో ఉద్యోగులు కోరుతున్న విధంగా ప్రభుత్వం సీపీఎస్ ను రద్దుచేసే అవకాశం లేదని తేలిపోవడంతో ఇక ఉద్యోగులు రూటు మారుస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రభుత్వంతో సై అంటే సై అంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. సీపీఎస్ పై ఇన్నాళ్లూ ఇతర సంఘాలతో కలిసి పోరాడిన ఆయన.. ఇప్పుడు రూటుమార్చి అసలు దానికి చట్టబద్ధత ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది.

మన రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రూల్స్, జీతభత్యాలు, పెన్షన్, ఇతర అంశాలన్నీ అసెంబ్లీలో చేసిన చట్టాల ద్వారా అమలవుతున్నాయని, కానీ సీపీఎస్ మాత్రమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమలువుతోందని, కాబట్టి దీనికి చట్టబద్థత లేదని నిన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చేసిన ప్రకటనపై స్పందించేందుకు ప్రభుత్వ పెద్దలు కానీ, మంత్రులు కానీ నిరాకరించడమే ఇందుకు నిదర్శనం.
చట్టబద్ధత లేకుండా లక్షల మంది ఉద్యోగుల సొమ్ము, భవిష్యత్తును పణంగా పెట్టారంటూ జగన్ ప్రభుత్వంపై కేఆర్ సూర్యనారాయణ చేసిన ఆరోపణలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. అలాగే 2004లో సీపీఎస్ అమలు కోసం అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని ఆయన కోర్టుల్లో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే ఏపీ ఉద్యోగులకూ, ప్రభుత్వానికీ మధ్య పోరు మరింత రసవత్తరంగా మారబోతోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో కేఆర్ సూర్యనారాయణ సీఎం జగన్ ముందు రెండు డిమాండ్లు పెట్టారు. ఇందులో ఒకటి సీపీఎస్ చట్టబద్ధం కాకపోతే జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీ మేరకు దాన్ని రద్దు చేయడం, రెండవది చట్టబద్ధత ఉందని భావిస్తే కేంద్రంతో సమానంగా పెన్షన్ అమలు చేసి ఉద్యోగులకు రూ.6 నుంచి రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించడం. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు హైకోర్టులో సీపీఎస్ చట్టబద్ధత తేల్చమంటూ పిటిషన్ దాఖలు చేసేందుకు ఉద్యోగ నేత సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications