హైకోర్టు వ్యాఖ్యలు- వైసీపీ కౌంటర్లు- కుట్రకోణంపై విచారణ ? కేంద్రం జోక్యం ఉంటుందా ?
ఏపీలో హైకోర్టు-ప్రభుత్వం మధ్య నానాటికీ మాటలయుద్ధం పెరుగుతోంది. ప్రభుత్వాన్ని ఉద్దేశించి దాదాపు అన్ని కేసుల్లోనూ హైకోర్టు తీవ్ర చేస్తున్న వ్యాఖ్యలకు... ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు అంతే దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో రెండు రాజ్యాంగ వ్యవస్ధల మధ్య అవాంఛిత సంఘర్షణ పెరుగుతోంది. ప్రభుత్వం తమపై యుద్ధం ప్రకటించిందా అనే స్ధాయికి హైకోర్టు వ్యాఖ్యలు చేరాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో అన్న టెన్షన్ నెలకొంటోంది. తాజాగా ప్రధాని, హోంమంత్రులను సీఎం జగన్ కలిసిన నేపథ్యంలో ఈ మాటల యుద్ధం మరింత తీవ్రం కావడం పరిస్ధితికి అద్దం పట్టేలా ఉంది.

హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల కలకలం..
ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు, పోలీసుల వ్యవహారశైలి, సీఐడీ పనితీరు వంటి అంశాల్లో ఈ మధ్య హైకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం పలు వ్యాఖ్యలు చేస్తోంది. గతంలో కోర్టులు తీర్పులు ఇచ్చేటప్పుడు తీర్పుతో పాటు సదరు వ్యవహారానికి సంబంధించి ఏవైనా వ్యాఖ్యలు చేయాలనుకుంటే వాటిని కూడా తీర్పులోనే ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. ఓ కేసు విచారణ ప్రారంభమై పూర్తయ్యలోపు పలుమార్లు హైకోర్టు ధర్మాసనాలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇవి సహజంగానే ప్రభుత్వానికి మంటపుట్టిస్తున్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వం ఉందా, వ్యవస్ధ పనిచేస్తోందా, కోర్టులు మూసుకోమంటారా అంటూ హైకోర్టు నుంచి వెలువడుతున్న పరుష వ్యాఖ్యలు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ప్రభుత్వ పెద్దల కౌంటర్లు...
హైకోర్టు ఇస్తున్న తీర్పులపై కానీ, వ్యాఖ్యలపై కానీ అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టులో అప్పీలు చేసి న్యాయం కోరే అవకాశం ప్రభుత్వానికే కాదు ఏ పిటిషనర్‌కు అయినా ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మాత్రం కోర్టు తీర్పులపై సోషల్ మీడియాలో కామెంట్లు, ప్రెస్‌మీట్లలో వ్యాఖ్యలు, ప్రెస్ నోట్ల రిలీజ్ చేస్తుండటం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తోంది. గతంలో హైకోర్టు తీర్పులపై ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, అధికారులు మాట్లాడాలంటేనే భయపడేవారు. కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించేవారు. స్ధూలంగా చెప్పాలంటే సంయమనం పాటించేందుకే మొగ్గుచూపేవారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఆ లౌక్యం లోపించినట్లు కనిపిస్తోంది. ఓ దశలో ఏపీ హైకోర్టు తీర్పులపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులోనే ప్రస్తావించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక సమస్యలతో పాటు న్యాయవ్యవస్ధ కూడా సమస్యలా మారిందని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

కుట్ర కోణంపై దర్యాప్తుకు సిద్ధమైన హైకోర్టు...
పలు కేసుల్లో హైకోర్టు ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం సీరియస్‌గా పరిగణించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లతో పాటు అధికార పార్టీ నేతలు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తాజాగా సీరియస్‌గా స్పందించింది. హైకోర్టుపై యుద్ధం ప్రకటించారా అని నేరుగానే ప్రశ్నించింది. దీంతో ప్రజల్లోనూ అధికార పార్టీ, ప్రభుత్వ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్న న్యాయవాదులకు పోలీసుల బెదిరింపుల వ్యవహారంలోనూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు ఈ వ్యవహారంలో కుట్ర కోణం తేలుస్తామంటూ ఈ మధ్య పలుమార్లు వ్యాఖ్యానించింది. దీంతో ప్రభుత్వ కౌంటర్ల వ్యవహారం కుట్ర కోణం వరకూ వెళ్లినట్లయింది.

వైసీపీ పెద్దల వాదన ఇదీ...
పలు కీలక కేసుల్లో హైకోర్టు ఇస్తున్న తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు.. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. తీర్పుల కంటే విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం, న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను పలుచన చేస్తున్నాయని వైసీపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాటిని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేందుకు మంత్రులు, వైసీపీ పెద్దలు సిద్ధమవుతున్నారు. అయితే స్దూలంగా వైసీపీ వాదన మాత్రం ఒకటే. హైకోర్టు తీర్పులను తాము గౌరవిస్తాం కానీ విచారణ సందర్భంగా చేసే వ్యాఖ్యలను తీర్పులోనే ప్రస్తావిస్తే సరిపోతుంది కదా అని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం కానీ న్యాయమూర్తుల వ్యాఖ్యలను సవాలు చేయలేం కదా అనేది వైసీపీ వాదన.
Recommended Video

కేంద్రం జోక్యం చేసుకుంటుందా ?
ఏపీలో ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై హైకోర్టు తీర్పులు, విచారణ సందర్భంగా వెలువడుతున్న కామెంట్ల నేపథ్యంలో ప్రభుత్వం-హైకోర్టు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతుందని సాధారణ జనం కూడా భావిస్తున్నారు. అయితే ఈ మాటల యుద్ధం ఎంతవరకూ వెళ్లబోతోంది, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందా లేక చోద్యం చూస్తూ గడిపేస్తుందా అన్న చర్చ మొదలైంది. వాస్తవానికి న్యాయ, అధికార వ్యవస్ధల మధ్య పోరు కొత్తేమీ కాకపోయినా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మాటలయుద్ధం పతాకస్ధాయికి వెళుతోంది. త్వరలో న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రాబోతోంది. ఇప్పటికే హైకోర్టుకు వ్యతిరేకంగా కుట్ర కోణం ఆరోపణలు నిత్యం న్యాయమూర్తుల నుంచే వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రం జోక్యం చేసుకుని రెండు వ్యవస్ధలకూ మధ్య ఘర్షణను నివారించాలనే వాదనలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications