కెసిఆర్, జగన్ కుట్ర కోణం: బాబును బయటపడేస్తుందా?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కుమ్మక్కయ్యారని విమర్శిస్తున్నారు.
అయితే, రేవంత్ రెడ్డి ఎసిబికి పట్టుబడిన విషయంపై చంద్రబాబు గానీ, ఆంధ్రప్రదేస్ మంత్రులు గానీ అతి తక్కువగా మాట్లాడానికే ఇష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎసిబికి పట్టుబడిన విషయం నిజమా, కాదా అనే విషయంపై వారు స్పష్టంగా సమాధానం ఇవ్వడం లేదు. కేసు నడుస్తోంది కదా అంటూ ఆ విషయాన్ని దాటవేస్తున్నారు.

కాగా, స్టీఫెన్‌సన్‌తో తాను మాట్లాడినట్లు బయటకు వచ్చిన ఆడియో టేప్ వ్యవహారంపై కూడా చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పడం లేదు. ఆ మాటలు తనవేనా, కావా అనే విషయంపై ఆయన జవాబు చెప్పడానికి ఇష్టపడడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని, అనైతికతకు పాల్పడుతున్నారని మాత్రమే అంటున్నారు.
ఈ స్థితిలో చంద్రబాబుపై అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి. చంద్రబాబును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మరింతగా చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఆయనను తొలి ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేరుగా రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి అదే విషయంపై విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా జగన్‌కు ఈ అంశం కలిసి వచ్చింది.
కాగా, రేవంత్ రెడ్డి కేసు ఎటు మలుపు తిరిగుతుందనే ఆసక్తి నెలకొని ఉంది. చంద్రబాబును సాక్షిగా ఎసిబి విచారిస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ విధమైన స్పష్టత రాలేదు. చంద్రబాబును కేసులో చేరుస్తారా, లేదా అనేది కూడా తేలడం లేదు. ఇది చంద్రబాబుకు తలనొప్పిగానే ఉంటుందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications