పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, కాంగ్రెస్‌కు గట్టి షాక్: చిరంజీవి హింట్, ఆనాడే తెల్చేసిన మెగా ఫ్యామిలీ
అమరావతి: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లే! పార్టీలో ఆయన తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని వార్తలు వచ్చాయి. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు వల్ల కూడా ఆయన దూరంగా జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ముఖ్యంగా తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఉండటం, జనసేనాని 2019 ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు వ్యతిరేకంగా చిరంజీవి ఏమీ మాట్లాడలేని, చేయలేని పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే అభిమానులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది.

రాజకీయ పరిణామాలు
వీటితో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు క్రమంగా దగ్గర కావడం కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. సహజంగా చిరంజీవి మృధుస్వభావి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా విపక్షాలను పవన్ కళ్యాణ్ విమర్శించినంత కూడా చిరంజీవి విమర్శలు చేయలేదు. ఘాటుగా మాట్లాడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో కలుస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితులు కూడా ఆయనను ఇరకాటంలో పడేశాయని అంటున్నారు.

ఇరుకున పడేసిన పవన్ కళ్యాణ్
మరోవైపు, పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక, ఇంకా చెప్పాలంటే 2014 తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండటం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆయన రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాజకీయాల పైన దృష్టి సారించడం సాధ్యం కాదని, మరోవైపు సోదరుడు పార్టీ పెట్టిన దృష్ట్యా అది కూడా ఇరుకున పడేసింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరం జరుగుతూ, రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు చిరంజీవి గుడ్‌బై గతంలోనే తేలిపోయింది
చిరంజీవి అధికారికంగా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన చేయనప్పటికీ, ఇప్పటికే ఆయన దూరం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారి విపక్షాల విమర్శలు, ఆరోపణలు అనవసరమనే ఉద్దేశ్యంతో ఉన్నారు. మరో విషయం ఏమంటే చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై విషయం ఎప్పుడో తెలిపోయిందని అంటున్నారు.

చెర్రీ, నాగబాబు అప్పుడే తేల్చేశారు
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు గత కొన్నాళ్లుగా సిద్ధమవుతున్నారు. పవన్ ఎప్పుడైతే రంగంలోకి దిగారో అప్పుడే చిరంజీవి గుడ్ బై తేలిపోయినట్లుగా భావించవచ్చునని అంటున్నారు. అందుకు మెగా కుటుంబ సభ్యుల స్పందన కూడా నిదర్శనమని అంటున్నారు. నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, వరణ్ తేజ ఇలా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికింది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వారు జనసేనానికి అండగా ఉంటామని చెప్పారు. అప్పటికే చిరంజీవి క్రియాశీలకంగా లేరు. తన రాజకీయ భవిష్యత్తుపై చిరంజీవి ముందే కుటుంబ సభ్యులతో చెప్పి ఉంటారని, కాబట్టే మెగా ఫ్యామిలీ జనసేనానికి అండగా నిలిచిందని భావించవచ్చునని చెబుతున్నారు. అంతేకాదు, చిరంజీవి ఫ్యాన్స్ నాయకులు కూడా జనసేనలో చేరినప్పుడే ఈ విషయం తేలిపోయిందని అంటున్నారు.

చిరంజీవి జనసేనాని పక్కన నిలబడినట్లే
ఇప్పటికే చిరంజీవి కాంగ్రెస్‌లో ఉండగా, పవన్ కళ్యాణ్ సొంత పార్టీ పెట్టడంతో అభిమానులు పూర్తిగా కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. అయితే అభిమానులు మాత్రం జనసేనానికి అండగా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీకే కాకుండా రాజకీయాలకు అనధికారికంగా గుడ్ బై చెప్పడం అభిమానులకు పెద్ద ఊరట అని అంటున్నారు. చిరంజీవి బయటకు వచ్చి ప్రచారం చేయకపోయినా, మెగా కుటుంబ సభ్యులు అండగా ఉంటారు. చిరంజీవి ఫ్యాన్స్ అండగా నిలబడతారు. అప్పుడు చిరంజీవి జనసేనాని పక్కన నిలబడినట్లే అంటున్నారు.

పవన్ ఉండగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయలేనిస్థితి
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం ద్వారా ఆయన ఇన్నాళ్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2019లో ఏపీలో కీలకంగా మారుతున్న సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొని ఉంటుంది.












Click it and Unblock the Notifications