వెంకయ్య వారసుడికి మద్దతిచ్చేనా - సీఎం జగన్ ఆలోచన మారిందా..!!
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీఏ అభ్యర్ధిగా ముర్ము పోటీ సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యుల వినతి మేరకు సీఎం జగన్ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. ఏపీలో ప్రచారానికి వచ్చిన సమయంలో తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు. ఇక, చంద్రబాబు సైతం అనూహ్యంగా చివరి నిమిషంలో తమ మద్దతు ప్రకటించారు. ఏపీ నుంచి అన్ని ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు అనుకూలంగా పోలయ్యాయి. ఇక, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సమీపిస్తోంది.

ఢిల్లీ కేంద్రంగా మారుతున్న సమీకరణాలు
వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఎన్డీఏ నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ధంఖర్ నామినేషన్ దాఖలు చేసారు. కాంగ్రెస్ నుంచి కర్ణాటక కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరేట్ అల్వా నామినేష్ వేశారు. ఇద్దరూ ఇప్పుడు పోటీలో ఉన్నారు. అయితే, ఉపరాష్ట్రపతి విషయంలో అటు వైసీపీ..ఇటు టీడీపీ అధికారికంగా తమ మద్దతు ఎవరికనేది బయట పెట్టలేదు. వైసీపీ సాధారణంగానే ఎన్డీఏకు ఈ ఎన్నికల్లోనూ మద్దతుగా నిలుస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ, తాజాగా పార్లమెంట్ కేంద్రంగా ఏపీ పైన కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలతో కొంత పరిస్థితి మారిందనే ప్రచారమూ సాగుతోంది. అయితే, కాంగ్రెస్ నేతకు సీఎం జగన్ మద్దతిచ్చే అవకాశం లేదని.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతిస్తారని పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.

సీఎం జగన్ ఎన్డీఏకే మద్దతు..!
రాష్ట్రపతి బాధ్యతల స్వీకరణకు సీఎం జగన్ హాజరవ్వనున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంశం పైన చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. వైసీపీకి రెండు సభల్లోనూ కలిపి 32 మంది సభ్యుల బలం ఉంది. కాగా, టీడీపీకి నలుగురు సభ్యుల బలం మాత్రమే ఉంది. కానీ, టీడీపీ ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీని పైన పార్టీ అధినేత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అటు తెలంగాణలో టీఆర్ఎస్ నిర్ణయం పైన ఉత్కంఠ కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇచ్చారు.

కేసీఆర్ తుది నిర్ణయం పై ఆసక్తి
ఆ సమయంలో సిన్హాకు మద్దతిచ్చిన పార్టీలో కాంగ్రెస్ ఉన్నా.. ఆ పార్టీతో తమకు ఎటువంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ముఖ్య నేత..మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. కానీ, ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వా అభ్యర్ధిగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి పని చేసిన బెంగాల్ సీఎం మమతా సైతం ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇప్పుడు కేసీఆర్ సైతం అదే బాట పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..సీఎం జగన్ తీసుకొనే నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలోనే విపక్ష నేతలు ఈ సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నారు. తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎవరు మద్దతు ఇచ్చేదీ...ఏ పార్టీలతో సంప్రదింపులు చేస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications