జగన్ దారిలో.. బాబుకు చిక్కులు: దాసరి మనసులో ఏముంది?
హైదరాబాద్: దర్సకరత్న దాసరి నారాయణ రావుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశ్యం ఉందా? లేక తన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పెట్టడమే లక్ష్యమా? అనే చర్చ సాగుతోంది. ఇటీవల కొంతకాలంగా దాసరి ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
జగన్‌కు దాసరి పొగడ్తల పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో దాసరి ఇంటికి వెళ్లి జగన్ కలిశారు. ఆ సమయంలో తమ పార్టీలో చేరాలని జగన్ ఆయనను ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వారు చెప్పారు.
రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పినప్పటికీ... దాసరి - జగన్ భేటీ నాడు ప్రాధాన్యత సంతరించుకుంది. దాసరి వైసిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని చేపట్టారు.

ముద్రగడ కాపు ఉద్యమం వెనుక జగన్ ఉన్నారని టిడిపి నేతలు ఆరోపించారు. అదే సమయంలో ముద్రగడ దీక్షకు దాసరి నారాయణ రావు సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా.. ప్రభుత్వం ఆయనను అడ్డగించింది. ఈ సమయంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాపు ఉద్యమం విషయంలో ముద్రగడకు, జగన్‌కు మధ్య దాసరి వారధిగా పని చేశాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అదే సమయంలో దాసరి ఇటీవల జగన్ పైన ప్రశంస కురిపిస్తున్నారు. ఆదివారం నాడు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. జగన్ డైనమిక్ లీడర్ అని కితాబిచ్చారు.
దాసరిని జగన్ కలవడం, కాపు ఉద్యమం విషయంలో ముద్రగడకు - జగన్‌కు మధ్యవర్తిగా ఉన్నారనే వాదన, కాపు ఉద్యమం సమయంలో ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లడం, కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబును ప్రశ్నించడం, జగన్ పైన ప్రశంసలు చూస్తుంటే ఆయన వైసిపి వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications