దేవినేని ఉమ ఒంటరవుతున్నారా ? అన్న వర్గం ఎంట్రీతో టికెట్ కోసం పాట్లు!
ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్ని దాదాపు మూడు దశాబ్దాలుగా తన కనుసన్నల్లో ఉండేలా చూసుకున్న దేవినేని కుటుంబానికి గత ఎన్నికల్లో దేవినేని ఉమ ఓటమి తర్వాత బీటలు వారడం మొదలైంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా ఆ ప్రభావం రాజకీయంగా తమ మీద పడకుండా చూసుకోవడం నాయకుల లక్షణం. కానీ దేవినేని ఉమ మాత్రం ఈ విషయంలో ఫెయిలైనట్లే కనిపిస్తోంది. గతంలో వరుసగా రెండుసార్లు గెలిచిన మైలవరం నుంచి మరోసారి పోటీకి సిద్దమవుతున్న ఉమకు ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి.
మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో పాటు దేవినేని ఉమకు అండగా నిలిచిన సొంత అన్న దేవినేని రమణ అనుచరులు ఇప్పుడు ఎదురు తిరిగారు. 1994లో దివంగత దేవినేని వెంకట రమణ వర్గంగా పేరు తెచ్చుకున్న పలువురు నేతలు ఆయన ఆకస్మిక మరణం తర్వాత తమ్ముడు ఉమకు అండగా నిలిచారు. వీరిలో రమణ అనుచరులుగా పేరున్న గన్నే వెంకటనారాయణ ప్రసాద్ ఎలియాస్ అన్నా, యలమంచిలి శ్రీనివాసరావు, సారధి, పొన్నం రవి, తాడికొండ నరేంద్ర, చావా నరసింహారావు తో పాటు పలువురు ఉన్నారు. వీరంతా గతంలో రమణ గెలుపు కోసం పనిచేసిన వారే.

అలాగే గన్నే వెంకట నారాయణ ప్రసాద్ విజయవాడలో కూడా టీడీపీ అభ్యర్థుల కోసం మూడు దశాబ్దాలుగా పనిచేస్తూనే ఉన్నారు. పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే దేవినేని ఉమకు నందిగామలో రెండు సార్లు, మైలవరంలో మూడు సార్లు అండగా నిలిచారు. ఎన్నికల ప్రచార నిర్వహణలో వీరంతా సిద్ధహస్తులు. రమణ, ఉమా విజయాల్లో కీలక పాత్ర పోషించిన వీరికి చంద్రబాబు గతంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమించారు. అయితే ఇపప్పుడు వీరంతా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు.
మైలవరం నియోజకవర్గంలో ఉమాకు ఎదురుగాలి వీస్తుండటంతో టీడీపీ అధిష్టానం ఆయన స్ధానంలో కొత్తవారికి చోటు కల్పించాలని ఆలోచనలో ఉంది. ఈ సమయంలో గన్నే ప్రసాద్ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను కలిసి మైలవరంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఆయన అనుచరులు పది రోజులుగా మైలవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ తెలుగుదేశం నాయకులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అధిష్టానం కూడా ప్రసాద్ ను మైలవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గన్నే ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో మైలవరంలో మరోసారి పోటీ కోసం దేవినేని ఉమ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతోంది. ఇప్పటికే టీడీపీలో వర్గపోరు కారణంగా ఈసారి మైలవరం టికెట్ వస్తుందా రాదా అన్న అభద్రతాభావంలో ఉన్న ఈ మాజీ మంత్రికి ఇప్పుడు అన్న రమణ వర్గం నుంచే పోటీ ఎదురవుతుండటంతో టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. మైలవరంలో ఉమను కాదని ప్రసాద్ ను టీడీపీ బరిలోకి దింపితే ఇక ఆయన రాజకీయ జీవితానికి బ్రేక్ పడినట్లే అనుకోవచ్చు.












Click it and Unblock the Notifications