అంతటా హల్‌చల్: రాజకీయాల్లోకి హీరో శివాజీ?
హైదరాబాద్: తాను రాజకీయాల్లోకి రాబోనని హీరో శివాజీ చెప్పినా ఎవరూ నమ్మినట్లు కనిపించడం లేదు. ఆయన చేస్తున్న హడావిడి చూస్తుంటే ఆయనకు రాజకీయ ఆసక్తి ఉందనే భావన కలుగుతోందని అంటున్నారు. శివాజీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులపై కేసులు పెట్టడంపై ఫైర్ అయిన శివాజీ ర్యాలీ చేపట్టారు.
అదే పద్ధతిలో ఈ మధ్య శివాజీ సినీ ఇండస్ట్రీకి దూరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా, మంగళవారం వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని హైదరాబాదులోని ఎంఎన్‌జే ఆసుపత్రి క్యాన్సర్ బాధిత చిన్నారుల్లో మానసికస్థైర్యాన్ని నింపే కార్యక్రమం చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, సునీల్, శివాజీ క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. చిన్నారులకు కానుకలు అందజేశారు. ఆ తర్వాత ప్రసంగించిన శివాజీ రాజకీయ నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందని, ప్రజల బాగోగులు చూసే నాథుడే కరువయ్యాడని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా రాజకీయాలను చక్కదిద్దడంపై కాస్తా దృష్టి పెట్టాలని, అప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పాడు. ఓ సామాన్య మానవుడికి ఆ రోజు ఎలా గడిచిపోవాలనే ఆలోచనే ఉంటుందని, అందుచేత నేతలు, రాయలసీమ, తెలంగాణ, రాష్ట్ర విభజన వంటి విషయాలను పక్కనబెట్టి ప్రజల గోడు వినాలని, వారి గురించి పట్టించుకోవాలన్నాడు. ముఖ్యంగా మొసలి కుంకల్ని పక్కనబెట్టి ప్రజలు రాజకీయ ప్రక్షాళన చేసే యువనేతను ఎంపిక చేసుకోవాలని పిలుపునిచ్చారు.
శివాజీ రాజకీయాల గురించి మాట్లాడుతుండడంతో ఆయన తప్పకుండా ఏదో ఓ రోజు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అంటున్నారు. యువనేతను ఎన్నుకోవాలని ఆయన చేసిన సూచనపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications