కోనసీమ అల్లర్ల కేసుల ఎత్తివేతతో వైసీపీకి లాభమా ? నష్టమా ?
కోనసీమ : ఏపీలో జిల్లాల విభజన సందర్భంగా చోటు చేసుకున్న కోనసీమ అల్లర్లు ఎన్నికలకు ముందు రాజకీయంగా కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా అమలాపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలన్నింటినీ కలిపి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే దీనిపై స్ధానికంగా కోనసీమ వాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్ధానిక ఎస్సీలు మాత్రం దీన్ని సమర్ధించారు.
జిల్లాల విభజన క్రమంలో కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని జీర్ణించుకోలేని ఎస్సీయేతర సామాజిక వర్గాలకు చెందిన కొందరు దాడులకు దిగారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగులబెట్టారు. పోలీసులు అల్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఓ పట్టాన వారు వెనక్కి తగ్గలేదు. చివరికి భారీ ఎత్తున కేసులు నమోదు చేసి అల్లర్లను అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో స్ధానికంగా ఉన్న కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాల యువకులపై నమోదు చేసిన కేసులు వివాదాస్పదమయ్యాయి.

కోనసీమ జిల్లా పేరు మార్పుపై వచ్చిన అభ్యంతరాల్ని తోసిపుచ్చే క్రమంలో వైసీపీ ప్రభుత్వం తమ సొంత మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేయించి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలూ వచ్చాయి. ఏదేమైనా కోనసీమ జిల్లాలో ఉన్న ఎస్సీ సంఘాలు దీనిపై గుర్రుగా ఉన్నాయి. అదే సమయంలో కోనసీమ అల్లర్ల కేసుల్ని ఎత్తేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాపులు, శెట్టిబలిజల మద్దతు కోల్పోయే పరిస్ధితి ఉండటంతో వైసీపీ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్సీ సంఘాలు మరింత మండిపడుతున్నాయి.
కోనసీమ అల్లర్ల కేసుల ఎత్తివేతపై సదరు మూడు సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని కూర్చుబెట్టి సీఎం జగన్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసారు. దీనిపై ఎస్సీ సంఘాలు మాత్రం పట్టు వీడటం లేదు. కేసుల్ని ఎత్తివేస్తే మాత్రం ఉద్యమం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం కేసుల ఎత్తివేతపై జీవోలు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే జరిగితే కోనసీమలో మళ్లీ ఉద్రిక్తతలు తప్పేలా లేవు. ఎన్నికలకు ముందు స్ధానికంగా ఉన్న నేతల్ని బుజ్జగించేలా ప్రజాప్రతినిధుల్ని సీఎం జగన్ ఒప్పించినా ఎస్సీ మంత్రి ఇంటిపై దాడి వ్యవహారంలో ప్రభుత్వ వ్యవహారశైలి మాత్రం వైసీపీకి ఇబ్బందులు కలిగించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications