ఏపిని సింగపూర్‌లా చేయడం సాధ్యం కాదు: కమిటీ
చిత్తూరు: ఏపిని సింగపూర్‌లా చేయడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం నిర్ణయం కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. బుధవారం ఆ కమిటీ తిరుపతిలో తన పర్యటనను ముగించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తాము ఆగస్టు నెలాఖరులోగా నివేదిక ఇస్తామని చెప్పారు.
మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐదుకోట్ల మంది ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నివేదిక రూపొందిస్తామని వారు తెలిపారు. ఇప్పటివరకు తమకు ఆరువేల ప్రతిపాదనలు అందాయన్న శివరామకృష్ణన్ తెలిపారు. తిరుపతిని ఏపి రాజధానిగా చేయాలని చాలా మంది కోరుతున్నారని, అందరి అభిప్రాయాలను కూడా తాము తమ నివేదికలో పొందుపరుస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

బుధవారం ఉదయం అధికారులతో భేటీ అయిన కమిటీ సభ్యులు తిరుపతిలో ప్రభుత్వ భూములు, భవనాల లభ్యతపై వివరాలు సేకరించారు. తర్వాత ఎస్వీయూ యూనివర్సిటీలోని సెనేట్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో సమావేశమయ్యారు.
తిరుపతిని రాజధాని చేయడానికి గల అర్హతను స్థానిక నేతలు కమిటీ దృష్టి తీసుకెళ్లారు. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు వినతులను స్వీకరించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన జిల్లా నాయకులు శివరామకృష్ణన్ కమిటీని కలిసి వినతి పత్రం అందజేశారు.












Click it and Unblock the Notifications