పవన్ గ్రాఫ్ మళ్లీ తగ్గుతోందా ? ఆ ఇద్దరు కాపు నేతలు టీడీపీకే ఎందుకు జై కొట్టారు ? అసలు కారణాలివే !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగడతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందులో సక్సెస్ కాలేకపోతున్నారనే భావన సర్వత్రా పెరుగుతోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడివిడిగానే పోరాడుతున్న విపక్షాలకు కాసేపు ఆశాదీపంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ (pawan kalyan) .. అంతలోనే మాయమైపోతున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్ని బ్యాలెన్స్ చేసేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఏపీలో జనసేన పుట్టిముంచేలా కనిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం విశాఖ రచ్చ తర్వాత ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ ను తనవైపుకు తిప్పుకున్న పవన్, చంద్రబాబు (chandrababu), ప్రధాని మోడీతో భేటీతో హీరో అయ్యారు. తిరిగి కొంతకాలంగా సినిమాల్లో బిజీ అయిపోవడంతో తిరిగి ఆయనపై అంచనాలు తగ్గుతున్నాయి.

మళ్లీ సైలెంట్ అయిన పవన్
ఏపీలో రెండు నెలల క్రితం ఒక్కసారిగా రాజకీయంగా యాక్టివ్ అయి వైసీపీ సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ ఇనాక్టివ్ అయిపోయారు. రాజకీయంగా తనను నమ్ముకున్న జనసేన నేతలతో పాటు అభిమానుల్ని ఇక్కడే వదిలిపెట్టి హైదరాబాద్ లో సినిమాలతో బిజీగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలున్న తరుణంలో పార్ట్ టైమ్ పాలిటిక్స్ ఇంకా కొనసాగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేనకు వచ్చే సీట్లపై కనీస అంచనాలు లేకుండా పోతున్నాయి. అంతేకాదు జనసేనలోకి రావాలనుకుంటున్న నేతలు సైతం ఆయన్ను వదిలి టీడీపీలోకి వెళ్లిపోతున్నారు.

జనసేనపై తగ్గుతున్న అంచనాలు
ఎన్నికలకు ఏడాదే మిగిలున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యాక్టివ్ రాజకీయాలతో రచ్చ రచ్చ చేస్తారని భావించిన అభిమానులకు ఆయన నిరాశ మిగులుస్తున్నారు. అలాగే క్షేత్రస్ధాయిలో అభ్యర్ధుల ప్రకటనతో పాటు బూత్ కమిటీల ఏర్పాటు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత కూడా నాదెండ్ల మనోహర్, నాగబాబు వంటి వారికి అప్పగించేశారు. దీంతో సహజంగానే పవన్ కు పార్టీపై పట్టులేకుండా పోతోంది. అదే సమయంలో జనసేనపై జనంలో ఈ మధ్య పెరిగిన అంచనాలు మళ్లీ తగ్గిపోతున్నాయి. ఎన్నికల వరకూ కొనసాగించిన పట్టును కాస్తా ఇప్పుడే విడిచేస్తే రేపు జనసేన తరఫున తామెలా పోటీ చేయాలని ఆశావహులు మల్లగుల్లా పడుతున్నారు.

టీడీపీవైపే నేతల మొగ్గు ?
జనసేన పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలతో పాటు ఆ పార్టీలోకి రావాలని ఈ మధ్య కాలంలో భావించిన నేతలు సైతం ఆ తర్వాత తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. వీరిలో ముఖ్యంగా బీజేపీ నుంచి జనసేనలోకి వస్తారని ఆశించిన కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీలో నుంచి జనసేనలోకి వస్తారనుకున్న మరో కాపు నేత వంగవీటి రాధా ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేశారు. కన్నా టీడీపీలో చేరిపోగా.. రాధా కూడా నిన్న నారా లోకేష్ ను కలిసి టీడీపీలోనే ఉంటానన్న సంకేతాలు పంపారు. దీంతో ఈ ఇద్దరు నేతలపై భారీగా ఆశలు పెట్టుకున్న జనసేనకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ,వైసీపీ నుంచి జనసేనలోకి రావాలనుకున్న నేతలు కూడా టీడీపీయే తమకు బెటర్ అనుకుంటున్నారు .

ఏపీలో పవన్ గ్రాఫ్ తగ్గుతోందా ?
ఈ ఏడాది ఆరంభంలో జనసేన పార్టీతో పొత్తు కొనసాగించేందుకు బీజేపీ, పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నించాయి. అప్పట్లో విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు నిత్యం పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా కనిపించడమే. దీంతో ఆయనకు ఉన్న జనాకర్షణ తమకు పనికొస్తుందని ఈ రెండు పార్టీలు భావించాయి. ఇప్పుడు కొంతకాలంగా పవన్ తిరిగి సినిమాల్లో బిజీ కావడంతో తిరిగి ఈ రెండు పార్టీలు పవన్ తో పొత్తు గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల నాటికి పవన్ తో పొత్తు గురించి ఆలోచిద్దామంటూ నేతలకు సర్దిచెబుతున్నాయి. మరోవైపు జనసేనలోకి రావాలని భావించిన నేతలు కూడా రాకపోవడంతో పవన్ గ్రాఫ్ మరోసారి పడిపోతున్నట్లు తాజా సర్వేలు, నివేదికలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications