ఏపీలో అత్యంత బలంగా బీజేపీ ! ఉండవల్లి వ్యాఖ్యలు నిజమేనా ? రాష్ట్రపతి పోరుతో మరోసారి..
ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆ పార్టీలోని కొందరు నేతల కారణంగా బీజేపీ ఇప్పటికీ నామమాత్రంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ. మరోసారి 2024లోనూ అదే ఫీట్ రిపీట్ చేసేలా కనిపిస్తోంది. కానీ త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం బీజేపీ మరే ఇతర రాష్ట్రంలో లేనంత బలంగా ఏపీలో కనిపిస్తోంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తాజాగా ఇదే విషయం చెప్పారు.

ఏపీలో బీజేపీ పరిస్ధితి
కేంద్రంలో వరుసగా రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్న బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తమకు అస్సలు పట్టు లేని ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాదిన కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ పాగా వేయగలిగింది. కానీ ఏపీ, తమిళనాడు, కేరళ,ఒడిషా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అస్సలు పట్టు చిక్కడం లేదు. ముఖ్యంగా ఏపీలో కనీసం సొంతంగా ఓ ఎమ్మెల్యే సీటు గెల్చుకునే పరిస్ధితుల్లో కూడా బీజేపీ లేదు. దీంతో బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్న పార్టీలు కూడా ఏపీలో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధం కాని పరిస్ధితులు ఉన్నాయి.

ఏపీలో అత్యంత బలంగా బీజేపీ ?
ఏపీలో కనీసం కార్పోరేటర్ సీటు కూడా గెల్చుకోలేని పరిస్ధితుల్లో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం అత్యంత బలంగా ఉందనే ఓ వాదన వినిపిస్తోంది. అదెలా అంటే తమకు ఏమాత్రం జనం మద్దతు, ప్రజాప్రతినిధులు లేనప్పటికీ కేంద్రంలో తమ పార్టీకి ఇక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి మద్దతుగా నిలుస్తుండమే. దీంతో పార్లమెంటులో కీలక బిల్లులైనా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా బీజేపీ ఏపీ నుంచి సునాయాసంగా మద్దతు పొందుతోంది. ఇక్కడి రాజకీయ పార్టీలు కూడా బీజేపీతో పోరాడి లాభం లేదని గ్రహించి కాషాయ గూటిలో అనధికారికంగా చేరిపోయాయి.

ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో పెట్టబోయే జాతీయ పార్టీకి సంబంధించి చర్యలు జరిపేందుకు హైదరాబాద్ వెళ్లిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన విపక్షం అవసరమని చెప్పారు. అదే క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో బీజేపీ అత్యంత బలంగా ఉందన్నారు. ఇక్కడి అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ పటిష్టంగా కనిపిస్తోందన్నారు. జాతీయస్దాయిలో కీలక అంశాల్లో ఏపీ సాయం బీజేపీకి సులువుగా దొరుకుతోందన్నారు. దీంతో బీజేపీ గూటిలో వైసీపీ, టీడీపీ ఎలా చేరిపోయాయో ఉండవల్లి స్పష్టంగా చెప్పినట్లయయింది.

రాష్ట్రపతి ఎన్నికలతో మరోసారి
గతంలో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలోనూ వైసీపీ, టీడీపీ బీజేపీకి అండగా నిలిచాయి. ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో మౌనంగా ఉండిపోయాయి. ఇప్పుడు మరోసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు బీజేపీ నిలబెట్టే అభ్యర్ధికి మద్దతిచ్చేందుకు సిద్దమవుతున్నారు. తద్వారా బీజేపీ అభ్యర్ధి రాచమార్గంలో గెలిచేందుకు వీరు బాటలు వేయనున్నారు. దీంతో ఏపీలో తనకున్న బలాన్ని జాతీయ స్ధాయిలో బీజేపీ మరోసారి నిరూపించుకనేందుకు కూడా వీలు దొరుకుతోంది.












Click it and Unblock the Notifications