వాలంటీర్లకు జగన్ తాజా హామీ - గుండెల్లో రైళ్లు...!!
ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. వాలంటీర్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతోంది. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి దూరం పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలతో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాలంటీర్లు రాజీనామాలు చేసారు. నెల్లూరు లో రాజీనామా చేసిన వాలంటీర్లు తాజాగా సీఎం జగన్ ను కలిసారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కీలక హామీ ఇచ్చారు.
వాలంటీర్ల రాజీనామా
ఏపీ లో వాలంటీర్ల వ్యవహారం రాజకీయ పార్టీల అస్త్రంగా మారుతోంది. వాలంటీర్ల పైన ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తో రాజకీయంగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. జగన్ ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతీ నెలా 1వ తేదీన లబ్దిదారుల ఇంటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు అందిస్తున్నారు. తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో... సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోవటం లబ్దిదారులకు సమస్యకు కారణమైంది. ఈ పరిణామాలపైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేయగా.. చంద్రబాబును సీఎం జగన్ లక్ష్యంగా చేసుకున్నారు.

జగన్ కీలక హామీ
ప్రతీ ఇంటికి దగ్గరైన వాలంటీర్ల సేవలను చంద్రబాబు దూరం చేసారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం తిరిగి వాలంటీర్ల నియామకం పైనే చేస్తానని ప్రకటించారు. అటు చంద్రబాబు సైతం తాను వాలంటీర్లకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. వాలంటీర్లకు వేతనాలు పెంచి..విద్యార్హత ఉన్నవారికి మెరుగైన జీతం వచ్చేలా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇటు తమ పైన రాకీయంగా వస్తున్న విమర్శల కారణంగా పలువురు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసారు. తాజాగా బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ ను కోవూరులో రాజీనామా చేసిన వాలంటీర్లు కలిసారు. తాజా పరిణామాల వేళ తమ అనుభవాలను సీఎంతో పంచుకున్నారు. ప్రతీ ఇంటి లోని లబ్దిదారులు తమ సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నారని వివరించారు.

కోడ్ పూర్తయ్యే వరకూ
వాలంటీర్లను అవమానించేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యలతోనే తాము రాజీనామాలు చేసామని చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వాలంటీర్ల ను తప్పించిన చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రతీ ఇంటికి ప్రభుత్వ సేవలు దగ్గర చేసే ఉద్దేశంతోనే తాము వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని జగన్ వివరించారు. దీంతో, ఇప్పుడు ఎన్నికల సమయంలో పలువురు వాలంటీర్లు రాజీనామా చేయటంతో.. కోడ్ ముగిసే వరకూ ఇంటికి అందుతున్న సేవల పైన కొత్త చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications