ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మద్దతిస్తానంటే: జగన్ కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ
అమరావతి/హైదరాబాద్: అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం 175 మంది తటస్థులతో హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. ఇటీవల బీహార్‌కు చెందిన జేడీయూలో చేరిన.. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రాష్ట్రంలోని తటస్థులకు (ఏ పార్టీకి చెందని వారిని) లేఖలు రాసి, వారితో భేటీ కావాలని సూచించారు.
ఇందులో భాగంగా తొలి దశలో 175 మందితో భేటీ అయ్యారు. మొత్తంగా వైసీపీ 70వేల మంది తటస్థులకు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. న్యూట్రల్‌గా ఉన్న విద్యార్థులు, మేధావులు, డాక్టర్లతో ఈ రోజు భేటీ అయ్యారు.

కేంద్రంలో హంగ్ వచ్చే పరిస్థితి
అన్ని పిలుపు కార్యక్రమంలో భాగంగా 175 మందితో భేటీ అయిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని చెప్పారు. హంగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. చట్టం ప్రకారం విశాఖపట్నంకు రైల్వే జోన్ రావాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు రైల్వే జోన్ ఉందని, మరి నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఎందుకు ఉండదని ప్రశ్నించారు. రైల్వే జోన్ కోసం పోరాటం చేద్దామన్నారు.

ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మోసపోతాం
మాటలు నమ్మి ఎన్నికలకు ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మోసపోతామని జగన్ అన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరితోను పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన నవరత్నాలు పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎంత కాపీ కొట్టినా ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రతి జిల్లాలో కూడా అన్న పిలుపులో భాగంగా తటస్థులను కలుస్తానని చెప్పారు.

ఎన్నికల తర్వాత ఎవరికి మద్దతిస్తానో చెప్పిన జగన్
ప్రతి కులానికి తాము కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. కేంద్రంలో కూడా ఇప్పుడే ఏ పార్టీతోను వెళ్లమని చెప్పారు. ప్రత్యేక హోదా ఫైల్ పైన ఎవరు సంతకం పెడతామంటే వారికి మద్దతిస్తామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్‌తో పాటు ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని అన్నారు. మగ్గం ఉన్న ప్రతి ఇంటికి రూ.2వేలు ఇస్తామని చెప్పారు. పవర్ లూమ్‌లు ఉన్న వారికి కరెంట్ ఛార్జీలు ఇస్తామని అన్నారు.

ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ
ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామనే మాటకు తాను కట్టుబడి ఉన్నానని జగన్ పునరుద్ఘాటించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేటట్లు చూస్తామని చెప్పారు. వైయస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు ప్రతి 50 కుటుంబాలకు రూ.5వేల జీతంతో ఒకరిని నియమిస్తామని చెప్పారు. ఏ పథకం అయినా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అన్నారు.












Click it and Unblock the Notifications