బీజేపీతో చంద్రబాబు మళ్లీ దోస్తీ: లీకులిచ్చిన మీడియా అధినేత
అమరావతి: జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ.. మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు కొద్దిరోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా వినిపిస్తోన్నాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, ఆ పార్టీ ఇతర నాయకులు గానీ బీజేపీని విమర్శించిన సందర్భాలు దాదాపుగా లేవు. వారి దృష్టి అంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఉంది. వైఎస్ జగన్, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని రోజూ విమర్శలు, ఆరోపణలు చేస్తోండటం దీనికి నిదర్శనం.

బీజేపీతో దోస్తీ కోసమే..
బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే విషయంలో తెలుగుదేశం పా్ర్టీ.. వైసీపీనే టార్గెట్‌గా చేసుకుంది. బీజేపీపై చేసిన విమర్శలు చాలా పరిమితం. ఇవన్నీ.. మళ్లీ చంద్రబాబు- బీజేపీతో పొత్తు పెట్టుకోవడాని సంకేతాలేనంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల మధ్య ఓ తెలుగు మీడియా అధినేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సీపీఐ నారాయణతో..
ఆ మీడియా అధినేతతో సీపీఐ సీనియర్ నేత కే నారాయణ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. చంద్రబాబు నాయుడితో తాము ఎప్పుడు కలవలేదని సీపీఐ నారాయణ అన్నారు. 2014, 2019 నాటి ఎన్నికలను పరోక్షంగా ఉటంకిస్తూ మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని పేర్కొన్నారు. అంతకుముందు (2009)లో చంద్రబాబుతో కలిసి పోటీ చేశామని గుర్తు చేశారు. ఆ తరువాత ఎప్పుడూ చంద్రబాబు తమను రానివ్వలేదని, తాము ఆయన వద్దకు ఎప్పుడూ పోలేదని చెప్పారు.

చంద్రబాబు సహకారం ఉంటేనే..
చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆయనను కలవలేదని స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే వేదిక మీదికి వచ్చే పరిస్థితి లేదని నారాయణ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉద్యమించచట్లేదని పేర్కొన్నారు. ఐక్యంగా ఉద్యమించడానికి చంద్రబాబు సహకరించాల్సి ఉంటుందని కుండబద్దలు కొట్టారు. తెలుగుదేశం పార్టీతో కలిసి కమ్యూనిస్టులు ఐక్య కార్యాచరణ కార్యక్రమాలను పెట్టొచ్చని, దానికి చంద్రబాబు సహకారం కావాలని చెప్పారు.

ఊగిసలాటలో చంద్రబాబు..
ప్రస్తుతం చంద్రబాబు ఊగిసలాటలో ఉన్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ రాధాకృష్ణ జోక్యం చేసుకుని.. చంద్రబాబు రేప్పొద్దున బీజేపీతో కలవచ్చు.. అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆ ఊగిసలాటలో ఉండటం వల్లే కమ్యూనిస్టులను పిలవట్లేదని నారాయణ తేల్చి చెప్పారు. లేదంటే చీటికి మాటికీ- ఐక్య కార్యాచరణ ఉద్యమాల కోసం ఆయన తమను పిలిచేవాడని అన్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు.. కనిపించినప్పుడు మాత్రమే హలో అంటే హలో అంటూ మాట్లాడుకోవడం తప్పితే మరొకటి లేదని చెప్పారు.

ఆయన భయం..ఆయనకు
కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు భయం.. చంద్రబాబుకు ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబులో బాగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్ జగన్‌కు కూడా అదే భయం ఉందని చెప్పారు. వామపక్ష పార్టీలతో కలిసి ఉంటే కేంద్రం విజృంభిస్తుందేమోననే భయం ఉందని, అందుకే మా మాడు (వైఎస్ జగన్) కూడా కమ్యూనిస్టులకు దూరంగా ఉంటున్నాడని ఓ మంత్రి తనకు వివరించినట్లు నారాయణ వివరించారు.

నీళ్లు, మట్టి మొఖాన కొట్టిన మోడీ..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మట్టి, నీళ్లు మొఖాన కొట్టిపోయారని గుర్తు చేశారు. ఈ విషయం తాను అప్పుడే చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పానని నారాయణ అన్నారు. ప్రత్యేక హోదాకు మూడునామాలు పెట్టారని, అప్పుడూ తాను చంద్రబాబు పాత విషయాలను గుర్తుచేశానని అన్నారు. చంద్రబాబు మీద నరేంద్ర మోడీకి ఉన్న కోపం పోయేది కాదని చెప్పుకొచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మోడీ ఇంకా మర్చిపోలేదని అన్నారు.

వైఎస్ కుటుంబంతో సన్నిహితం ఎక్కువ..
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన వెంటనే- ఆ పార్టీ నాయకులు పొత్తు కోసం తమను సంప్రదించారని నారాయణ అన్నారు. సీపీఎం కంటే.. సీపీఐతోనే వైఎస్ కుటుంబానికి సాన్నిహిత్యం ఎక్కువ అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమ పార్టీ నేతలను మంచి స్నేహ సంబంధాలు ఉండేవని అన్నారు. రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ అని నారాయణ కితాబిచ్చారు. అదే సత్సంబంధాలను కొనసాగించడానికి వైసీపీ నాయకులు తమను కలిశారని చెప్పారు.

అవినీతి కూపం నుంచే వైసీపీ ఆవిర్భావం..
రాజకీయాల్లో అవినీతి సాధారణమే అయినప్పటికీ.. వైసీపీ మాత్రం ఆ కూపం నుంచే ఆవిర్భవించిందని నారాయణ అన్నారు. ఆ కారణంతోనే వైసీపీని దూరం పెట్టామని చెప్పారు. ఆ తరువాత కూడా వైసీపీ తమ పట్ల మెతకవైఖరితోనే ఉందని పేర్కొన్నారు. వైసీపీ పట్ల సానుకూలంగా ఉండే విషయంలో తమ సోదరులు (సీపీఎం) కొంత మెత్తపడినట్టు కనిపిస్తోందని, సీపీఐ మాత్రం ఆ పార్టీని దూరంగానే ఉంచుతుందని నారాయణ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications