విశాఖ ఎమ్మెల్సీ పోరు నుంచి టీడీపీ తప్పుకోనుందా ? కీలక కారణాలివే..!
గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినా అభ్యర్ధిని వెంటనే ప్రకటించడమే కాకుండా పక్కా వ్యూహంతో నెగ్గించుకున్న టీడీపీ.. ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అధికారంలో ఉండి కూడా అభ్యర్ధిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతోంది. ఇంకా చెప్పాలంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసేస్తోంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.
విశాఖ స్థానిక సంస్థల కోటాలో గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరిపోవడం, అనర్హత వేటు పడటం, ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు పడటం, అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ సీటు నుంచి పోటీ చేసి గెలవడం జరిగిపోయాయి. దీంతో ఆయన గెలిచిన విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే స్థానిక సంస్థల కోటాలో ప్రస్తుత బలాబలాలు చూసుకుంటే మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు కలిపి ఈ ఎమ్మెల్సీ సీటుకు మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 600కు పైగా ఓట్లు ఉన్నాయి. ఇదే ఇప్పుడు కూటమి అభ్యర్ధి ఎంపిక విషయంలో చంద్రబాబు సహా అధికార పక్షాన్ని కలవరపెడుతోంది. నిన్న ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపికపై సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో కూటమి పార్టీల నేతలు ఈ సీటు కచ్చితంగా గెలుస్తామని చంద్రబాబుకు చెప్పలేకపోయారు. దీంతో వాస్తవ పరిస్ధితి తెలుసుకునేందుకు ఆయన ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ నియమించారు.
ఇప్పటికే ఈ సీటును గెల్చుకునేందుకు మూడొంతుల బలం ఉన్న వైసీపీ అభ్యర్ధిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడమే కాకుండా, ప్రలోభాల బారిన పడకుండా ఓటర్లను క్యాంపులకు తరలించేసింది. ఇప్పుడు వీరిలో కనీసం సగం మందిని అధికార కూటమి తమవైపు తిప్పుకోవడం కష్టంగా మారింది.
దీంతో ఈ బాధంతా ఎందుకు పోటీ పడకుండా ఉంటే ఏమవుతుందనే కోణంలో కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. పోటీ చేసి ఓడిపోవడం కంటే దూరంగా ఉంటే పరువు దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. అసలే జీవీఎంసీ స్ధాండింగ్ కమిటీ ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేసిన ఆనందం నిలవాలంటే ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉండాలని పలువురు కూటమి నేతలు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications