Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రకు అసలైన టర్నింగ్ పాయింట్ రాబోతోందా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఏపీలో అన్ని జిల్లాల్ల్ని కవర్ చేసేలా రూపొందించిన ఈ యాత్రకు వైసీపీ సర్కార్ ఆరంభంలో ఆటంకాలు కల్పించినా ఆ తర్వాత మాత్రం వదిలేసింది. దీంతో యాత్ర మాత్రం కొనసాగుతున్నా.. ఎలాంటి ప్రభావం మాత్రం కనిపించడం లేదు.
లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా బద్వేలులో కొనసాగుతోంది. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు అసలైన ఊపు తెచ్చే రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ బహిష్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లోకేష్ సమక్షంలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ నెల 13న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఎంట్రీ ఇవ్వగానే ఆయన్ను కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు. దీంతో ఇన్నాళ్లూ లోకేష్ పాదయాత్రకు రాని ఊపు నెల్లూరు జిల్లాలో రాబోతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ లోకేష్ యాత్రను టీడీపీ క్యాడర్ మాత్రమే భుజాన వేసుకుని నడిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి కానీ, కొత్త నేతల నుంచి కానీ ఎక్కడా మద్దతు లభించడం లేదు. అలాగే లోకేష్ స్పీచ్ లు కూడా పేలవంగా ఉంటున్నాయన్న ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేల చేరికలు టర్నింగ్ పాయింట్ గా మారబోతున్నాయి.
ఇప్పటివరకూ టీడీపీ బలహీనంగా ఉందని భావిస్తున్న రాయలసీమ జిల్లాల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపిన లోకేష్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికతో ఊపు వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. అలాగే మిగతా జిల్లాల్లో యాత్రకు కావాల్సిన ఊపు నెల్లూరులో లభిస్తే ఆ తర్వాత తమకు బలం ఉండే ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సాఫీగా సాగిపోతుందని అంచనా వేసుకుంటోంది.












Click it and Unblock the Notifications