జగన్ కల జనసేనకు వరమవుతుందా ? ఇప్పటికే పవన్ కేంద్రంగా రాజకీయం ! తెలంగాణ స్టోరీ రిపీట్ !
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన తర్వాత అధికారం నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలు కీలకంగా మారాయి. జగన్ కు వ్యతిరేకంగా విపక్ష పార్టీలను కూడగట్టేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్దాయిలో మారుతున్న పరిస్ధితులు టీడీపీ అధినేత చంద్రబాబును సైతం పవన్ మద్దతు కోసం ప్రయత్నించేదాకా తీసుకెళ్లాయి. అటు బీజేపీ కూడా పవన్ ను వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ పరిస్దితి భవిష్యత్తులో ఎలా మారబోతోందన్న చర్చ మొదలైంది.

టీడీపీ అడ్డుతొలగించుకుంటున్న జగన్
ఏపీలో 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితమైన టీడీపీ పనైపోయిందని ఓవైపు చెప్తూనే, మరోవైపు ఆ పార్టీని క్షేత్రస్దాయిలో నామరూపాల్లేకుండా చేసేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలపై కేసులు, దాడుల రూపంలో భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికార వైసీపీ.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ప్రక్రియ అమల్లోకి వస్తే ఎలాగో టీడీపీ అడ్డు తొలగిపోతుందని జగన్ ధీమాగా ఉన్నారు. అయితే జగన్ వ్యూహాలు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీయబోతున్నాయి.

టీడీపీ స్ధానం జనసేన ఆక్రమిస్తుందా ?
ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న టీడీపీని నామరూపాల్లేకుండా చేసేందుకు వైసీపీ అధినేత అమలు చేస్తున్న వ్యూహాలు మరో విపక్ష పార్టీ జనసేనకు మేలు చేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయంతో రాష్ట్రంలో ఎదిగేందుకు దారులు వేసుకుంటున్న జనసేనకు వైసీపీ ప్రయత్నాలు వరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా టీడీపీ విఫలమైతే ఆ స్ధానంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. దాన్ని భర్తీ చేసేందుకు వరుసలో టీడీపీ తర్వాత ఉన్న పార్టీగా జనసేనకు ఆ అవకాశం లభించడం ఖాయం. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

జనసేన ఆదరణ పంపుతున్న సంకేతాలు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు టీడీపీకి ఎంత మేరకు నష్టం చేస్తున్నాయో తెలియదు కానీ జనసేనకు మాత్రం భారీగా లబ్ది చేకూరుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ చుట్టూ సాగుతున్న రాజకీయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖలో వైసీపీ గర్జన అనంతర పరిస్ధితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడం, పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు ఆదరణ మరింత పెరిగిందన్న సంకేతాలు కనిపించాయి. ఇది తెలిసే చంద్రబాబు విజయవాడ నోవోటెల్ హోటల్లో ఆయన్ను కలిసి భవిష్యత్తు రాజకీయంపై చర్చించారు. ఈ విషయం తెలిసే ప్రధాని మోడీ తన వైజాగ్ టూర్ లో ముందుగా పవన్ ను పిలిపించుకుని మాట్లాడారు. ఇలా చంద్రబాబు, ప్రధాని వంటి నేతలే పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యం రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి ఉదాహరణగా విశ్లేషకులు చెప్తున్నారు.

ఏపీలో తెలంగాణ సీన్ రిపీట్ ?
ఏపీకి పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకు అక్కడి సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఓవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు ఫిరాయించని వారిపై కేసులు నమోదుచేస్తూ దారికి తెచ్చుకున్నారు. తద్వారా విజయవంతంగా కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు ఆ స్దానంలో బీజేపీ వచ్చి చేరిపోయింది. ఇప్పుడు బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్దితుల్లోకి కేసీఆర్ జారిపోయారు. అంతేకాదు బీజేపీ ఎంపీల్ని టార్గెట్ చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. అలాగని వారిని ఆషామాషీ తీసుకునే పరిస్ధితీ లేదు. బీజేపీపై పోరు కోసం ఏకంగా తన పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీంతో ఇప్పుడు ఏపీలోనూ టీడీపీని నిర్వీర్యం చేసేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ బలంగా లేని బీజేపీ స్ధానంలో జనసేనకు వరంగా మారుతున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications