ఇండియా కూటమితో కలవటం పై తేల్చేసిన జగన్..!!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ఢిల్లీ వేదికగా జగన్ చేసిన ధర్నా అనంతరం కొత్త లెక్కలు మొదలయ్యాయి. గత అయిదేళ్ల కాలంగా అవసరమైన సమయంలో ఎన్డీఏకు మద్దతిస్తూ వస్తున్న జగన్ రూటు మార్చారు. ఇప్పుడు టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండటంతో జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారు. ఢిల్లీలో కూటమి పార్టీలు జగన్ కు మద్దతిచ్చాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పై జగన్ తన వైఖరి తేల్చి చెప్పారు.
ఇండియా కూటమితో
ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఇండియా కూటమి నేతలు తమతో కలిసి రావాలని జగన్ ను ఆహ్వానించాయి. ఈ అంశం పైన జగన్ స్పందించారు. తాము బీజేపీ, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలను మద్దతుగా నిలవాలని ఆహ్వానించామన్నారు. అయితే, ఇండియా కటమి నుంచి కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు వచ్చాయని చెప్పారు. దీనికి కారణంగా కాంగ్రెస్ చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఎలా టచ్ లో ఉన్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ కు సంకేతాలు
తమకు మద్దతుగా నిలిచిన పార్టీలకు తాము అండగా నిలుస్తామని జగన్ స్పష్టం చేసారు. దీంతో, ఈ నెల 30న ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా కూటమి నిరసనకు వైసీపీ హాజరు పైన ఆసక్తి పెరుగుతోంది. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినా ఆయనపై కనికరం చూపడంలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం తీరుకి వ్యతిరేకంగా ఈనెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూటమి నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. జగన్ ధర్నాకు ఆప్ నేతలు మద్దతు పలికారు. దీంతో, ఆప్ ఆందోళనలో వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
ఆప్ కు మద్దతుగా ఉంటారా
కాంగ్రెస్ తమకు మద్దతిచ్చేందుకు ఎందకు రాలేదని జగన్ ప్రశ్నించటం ద్వారా..ఆ పార్టీ ముందుకు వస్తే తాను సానుకూలంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్ధి ఎన్డీఏలో ఉండటంతో జగన్ నిర్ణయంపైన స్పష్టత రావాల్సి ఉంది. రాజ్యసభలో వైసీపీ కీలకంగా ఉంది. అటు ఎన్డీఏకు దూరమై ఇక ఇండియా కూటమితో కలుస్తారా..తటస్థంగానే అంశాల వారీగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ నెల 30న ఢిల్లీలో ఇండియా కూటమి ఆందోళనకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే నిర్ణయం ఆధారంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications