విశాఖలో విచిత్ర సంఘటన: మైనర్ బాలికను పెళ్లాడిన యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖపట్నంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. తనకు 15 రోజుల క్రితం పరిచయమైన ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తేజ అనే 25 ఏళ్ల యువతి బాలికను తిరుపతికి తీసుకెళ్లి వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు యువతికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం నగర పరిధిలోని పెదగంట్యాడ దిబ్బపాలెం కాలనీకి చెందిన కుక్కిరి యలమాజి అలియాస్ తేజ (25) డిగ్రీ వరకు చదివింది. యువతి నడవడిక బాగోకపోవడంతో మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటివేశారు.

woman married girl in visakhapatnam

దీంతో యువతి ఎయిర్ టెల్ డీలర్ దగ్గర ఉద్యోగంలో చేరి అదే కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈ క్రమంలో గతేడాది పదో తరగతి పాసై ప్రస్తుతం గాజువాకలోని ఓ ఫుట్‌పాత్ దుస్తుల షాపులో పని చేస్తున్న యాతపాలేనికి చెందిన బాలిక (16)తో రెండు వారాల క్రితం తేజకు పరిచయం ఏర్పడింది.

వారి పరిచయం ప్రేమగా మారి, ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. పెళ్లి చేసుకుని.. కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పది రోజుల క్రితం తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకుని తిరిగి విశాఖకు వచ్చారు. ఇదే సమయంలో కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించారు.

మైనర్ బాలిక మెడలో తాళిని గమనించిన తల్లిదండ్రులు నిలదీసే సరికి ఆ బాలిక విషయం చెప్పింది. ఈ క్రమంలో తేజ మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. తాము వివాహం చేసుకున్నామని చెప్పారు. దీంతో తేజను పట్టుకుని అందరూ చూస్తుండగా దేహశుద్ధి చేశారు. అనంతరం తేజను గాజువాక పోలీసులకు అప్పగించారు.

తమ మనసులు కలిశాయని, జీవితాంతం కలిసుంటామని, తమను వదిలివేయాలని పోలీసులకు చెప్పగా, గాజువాక సీఐ ఇమ్మానుయేల్ రాజు, ఎస్‌ఐ అప్పలరాజు వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తేజను అదుపులోకి తీసుకుని, బాలికను తల్లిదండ్రులతో ఇంటికి పంపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Woman married girl in visakhapatnam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి