మీడియాపై టెక్కీ భవ్యశ్రీ రుసరుస! వదిలేయాలని భర్త
హైదరాబాద్: మూడు రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్టువేర్ ఇంజనీర్ భవ్యశ్రీ కథ సుఖాంతమైన విషయం తెలిసిందే. పోలీసులు ఆమెను ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, తాను కిడ్నాప్‌కు అవలేదని, కేవలం రిలీఫ్ కోసమే వెళ్లానని చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత సమస్యను రచ్చ చేశారని ఆమె ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని చెబుతున్నారు.
వ్యక్తిగత, కుటుంబ వివరాలను అనవసరంగా బయటకు లాగారని ఆమె మీడియా పైన మండిపడ్డారు. తనకు, భవ్యశ్రీకి ఎలాంటి వివాదాలు లేవని భర్త కార్తీకేయ చైతన్య కూడా చెప్పారు. తన భార్య క్షేమంగా ఇంటికి చేరుకుందని, ఇంతటితో ఈ కేసును వదిలేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, విజయవాడకు చెందిన భవ్యశ్రీ చరిత హైదరాబాదులోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో పనిచేస్తూ ఓ హార్డ్‌వేర్ ఇంజనీర్ కార్తికేయ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నెల 9న క్యాబ్‌లో ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది.

దీంతో, ఎంతసేపైనా భార్య రాకపోవడంతో చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముందుగా అన్నవరంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాలకు సమాచారం అందించారు.
అక్కడ కూడా భవ్యశ్రీ దొరకకపోవడంతో ఆమె కోసం వెతుకులాట సాగించారు. ఇంతలో పాడేరు గెస్ట్ హౌస్‌లో ఆమె ఉన్నట్టు గుర్తించి అక్కడికెళ్లారు. అంతలోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఆమె విశాఖలో దొరికారు. ఆమెను హైదరాబాదు తీసుకొచ్చిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే, ఆమె ఇంటి నుంచి ఎందుకు వెళ్లారు? ఎవరితో వెళ్లారు? వైజాగ్ వెళ్లాలనుకున్నప్పుడు అన్నవరం, పాడేరు గెస్ట్ హౌస్ లకు ఎందుకు వెళ్లారు? వంటి ప్రశ్నలన్నీ సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలాయని అంటున్నారు. అయితే, రిలీఫ్ కోసం వైజాగ్ వెళ్లానని భవ్యశ్రీయే చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications