ఎంతమంది ఎన్ని తిట్టినా..తగ్గేదే లే: ఆ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రఘురామ చురకలు: రాజశేఖర్‌తో
హైదరాబాద్: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెబెల్‌గా గుర్తింపు పొందిన లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. తన వైఖరిని స్పష్టం చేశారు. జగన్ సర్కార్‌పై తనకు ఉన్న అసహనాన్ని మళ్లీ ప్రదర్శించారు. శుక్రవారం తిరుపతిలో ఏర్పాటైన అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనడం ద్వారా- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని మరోమారు బాహటంగా వ్యతిరేకించిన సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో..
శనివారం రాత్రి ఆయన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు..ఎప్పుడు..ఎక్కడ) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆ సినిమా లోగోను ఆవిష్కరించారు. రమంత్రా బ్యానర్ కింద రూపొందిన సినిమా ఇది. మలయాళంలో ఫహద్ ఫాజిల్ హీరోగా విడుదలైన సీ యూ సూన్‌కు ఫ్రీమేక్‌గా చెబుతున్నారు. కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది. రాజు దాట్ల నిర్మాత. రాజు దాట్లతో రఘురామ కృష్ణంరాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన ఈ మూవీకి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు.

సినిమా లవర్‌నే..
లోగోను ఆవిష్కరించిన అనంతరం రఘురామ కృష్ణంరాజు మాట్లాడారు. తాను కూడా సినిమా లవర్‌నేనని అన్నారు. సినీ సాహిత్యం అంటే తనకు చాలా ఇష్టమని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, డాక్టర్ సీ నారాయణ రెడ్డి పాటలను ఎంజాయ్ చేస్తానని చెప్పారు. రమంత్రా లోగోను ఆవిష్కరించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. దర్శకుడు కేవీ గుహన్ చాలా బాగా తీశారని పేర్కొన్నారు. కొన్నిప్రొమోలను చూశానని అవి సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయని చెప్పారు.

టెక్నీషియన్స్‌కు మొమెంటోలు..
హీరోయిన్ శివానీ రాజశేఖర్ చాలా బాగా నటించారని రఘురామ కితాబిచ్చారు. హీరో ఆదిత్ అరుణ్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించారని, మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవాలని అకాంక్షించారు. ఇలాంటి సినిమాలను తీయడానికి నిర్మాతలకు సాహసం కావాలని, ఆ సాహసం చేశారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కే కింగ్, ఎడిటర్ తమ్మిరాజు, నటుడు మిర్చి కిరణ్, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్‌కు మొమెంటో అందించారు. హీరోయిన్‌గా నటించిన శివానీ రాజశేఖర్‌కు రఘురామ బెస్ట్ విషెస్ చెప్పారు. అనంతరం రాజశేఖర్‌తో ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. జీవిత రాజశేఖర్‌ను చిరునవ్వుతో పలికరించారు.

విడుదలైన రోజే పుష్ప చూశా..
ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు రఘురామ బదులిచ్చారు. ఎంపీగా సినిమా చూసేంతటి సమయం ఉంటుందా? అని యాంకర్ ప్రశ్నించగా.. ఖచ్చితంగా చూస్తానని చెప్పారు. విడుదలైన రెండు వారాల్లోనే సినిమా చూస్తానని అన్నారు. నేను చూడని సినిమా ఉండదని రఘురామ స్పష్టం చేశారు. పుష్ప మూవీ చూశానని అన్నారు. పుష్ప చూసి థ్రిల్ అయ్యానని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్.. తనను తాను మార్చుకున్న తీరు అద్భుతమని అనిపించిందని చెప్పారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ సినిమాతో డిఫరెంట్ స్టార్‌గా మారారని చెప్పారు.

తగ్గేదేలే.. నా పరిస్థితీ ఇదే..
తగ్గేదే లే.. అనేది పుష్ప సినిమాలో తనకు బాగా నచ్చిన డైలాగ్ అని, ఇప్పుడు తాను కూడా అదే స్థితిలో ఉన్నానని రఘురామ వ్యాఖ్యానించారు. ఎంతమంది తనను ఎన్ని తిట్టు తిట్టినా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. తన పరిస్థితికి ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుందని రఘురామ అన్నారు. ఈ సందర్భంగా- యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు రఘురామ సమాధానం ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. ప్రజా నాయకులకు చాలా పనులు ఉంటాయని, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో ప్రజలను ఎలా ఆదుకున్నారని ప్రశ్నించారు.

స్టుపిడ్ పాలిటిక్స్..
జూమ్ కాల్ ద్వారా ప్రజలను ఆదుకోవడం కోసం నిర్వహించినవి ఏమైనా ఉన్నాయా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అడిగారు.దీనికి రఘురామ బదులిస్తూ- అవన్నీ రెగ్యులర్‌గా నడుస్తుంటాయని చెప్పారు. దురదృష్టశావత్తు తాను నియోజకవర్గం ప్రజలను కలుసుకోలేకపోతున్నానని, స్టుపిడ్ పొలిటికల్ రీజన్స్ అని తేల్చి చెప్పారు. అయినప్పటికీ- తన నియోజకవర్గం ప్రజలను తాను ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ లేదా, జూమ్ కాల్స్ ద్వారా కలుస్తుంటానని అన్నారు. దీనికి బదులుగా యాంకర్ మాట్లాడుతూ- ఇలాగే ప్రజాసేవను కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications