ఒక్కో కుటుంబంపై రూ.2.5లక్షల భారం.. పరిస్థితి ఎంత దిగజారిందంటే... : జగన్ సర్కార్ అప్పులపై యనమల
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలు తీవ్రం కాబోతున్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్‌లో జగన్ విఫలమయ్యారని... రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఏప్రిల్ మాసానికి గాను రాష్ట్రం చేసిన అప్పుల నివేదికను చూసి కేంద్ర అధికారులే విస్తుపోయారని అన్నారు.
రాష్ట్రాల రుణపరిమితిలో కేంద్రం భారీ కోత విధించినప్పటికీ జగన్ సర్కార్ గుణపాఠం నేర్చుకోవట్లేదని విమర్శించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎఫ్‌ఆర్‌బీఎం రివ్యూ కమిటీ హెచ్చరించినా జగన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. రాష్ట్రాల జీడీపీలో అప్పుల నిష్పత్తి 20శాతం దాటితే ఆ రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ సరిగా లేనట్లుగా కేంద్రం భావిస్తుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అప్పుల నిష్పత్తి ఆ రాష్ట్ర జీడీపీలో 17శాతం ఉంటే... ఏపీ అప్పుల నిష్పత్తి 31.46శాతం ఉందన్నారు.

దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ 3లో ఉందన్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేస్తుండటంతో రాష్ట్ర ప్రజలపై మరింత పన్నుల భారం తప్పకపోవచ్చునని అన్నారు. ఇప్పటివరకూ చేసిన అప్పులు.. వేస్తున్న పన్నులు, పెంచిన ధరలతో రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై రూ.2.5 లక్షల భారం పడనుందని అంచనా వేశారు.
ఇక నిరుద్యోగ అంశాన్ని ప్రస్తావిస్తూ... జగన్ పాలనలో నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తున్నామని యనమల అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యల పాపం జగన్‌దే అని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు తొలిసారి చూస్తున్నామని అన్నారు.
Recommended Video
మరో టీడీపీ నేత పట్టాభి సైతం ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు చెల్లించి అప్పులు తీసుకుంటున్నది ఏపీనే అన్నారు. అప్పుల రికవరీ విషయంలో రాష్ట్రంపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం వల్లే ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే జగన్ ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు చేస్తోందన్నారు. గతంలో 7.15శాతం వడ్డీతో రూ.1వెయ్యి కోట్లు,7.19శాతం వడ్డీతో మరో రూ.1వెయ్యి కోట్లు తీసుకొచ్చారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications