కోడిపందేలపై స్పష్టత రావాలి: మంత్రి యనమల
హైదరాబాద్: కోడి పందేలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టత రావాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కోడి పందేలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కోడి పందేలు సాంప్రదాయబద్దంగా నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు ఉత్తర్వులకు లోబడే కోడిపందాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి యనమల రామకృష్ణుడు తెలియజేశారు.

కాగా, కోడి పందేలపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. కోడి పందేలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను తప్పుపట్టింది.
కోడిపందేల నిషేధంపై రాష్ట్ర ప్రభత్వం ఉత్తర్వులు ఇవ్వనప్పుడు హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసులో తుది తీర్పునివ్వాలని హైకోర్టుకు, సుప్రీం సూచించింది. తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని వెల్లడించింది.
కోడిపందేల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హైకోర్టు తుదితీర్పు వచ్చే వరకు కోడిపందాలు నిర్వహించుకోవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కోడిపందేలు ఆడేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోడిపందేలు నిర్వహించుకునేందుకు సన్నాహకాలు మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications