వరంగల్ ఎయిర్పోర్ట్ పై గుడ్ న్యూస్... భద్రాద్రి ఎయిర్పోర్ట్ పై బ్యాడ్ న్యూస్!
తెలంగాణా రాష్ట్ర ప్రగతికి విమాన యాన అభివృద్ధి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెలంగాణాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం కోసం కీలక అడుగులు వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన అనుసంధానాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ ల నిర్మాణాన్ని చేపట్టింది.
మామునూరు ఎయిర్ పోర్ట్ గురించి కేంద్ర పౌర విమాన యాన శాఖా సహాయ మంత్రి
చారిత్రక వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ. 496. 86 కోట్ల అంచనా వ్యయంతో సూత్ర ప్రాయ అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహుల్ పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాలలో భాగంగా, కాంగ్రెస్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్ యాదవ్ లు అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా వివరాలను వెల్లడించారు.

ఎయిర్ పోర్ట్ పూర్తి కావాలంటే ఇవన్నీ కీలకం
ఇక ఎయిర్ పోర్ట్ పూర్తి కావటం తమ చేతుల్లో లేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే భూసేకరణ, అవసరమైన చట్టబద్దమైన అనుమతుల లభ్యత, ఇతర మౌలిక వసతుల కల్పనపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. అంతేకాదు తెలంగాణా సర్కార్ ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోనూ విమానాశ్రయాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి తెలిపారు.
పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ లపై కీలక అప్డేట్
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన స్థలం పై ఏఏఐ ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసి దాని నివేదికను ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే తెలంగాణా సర్కార్ కు సమర్పించినట్టు తెలుపారు. ఆదిలాబాద్ లో నిరుపయోగంగా ఉన్న ఎయిర్ ఫీల్డ్ ను ఉమ్మడి అవసరాలకు సివిల్, మిలటరీ కోసం వినియోగించుకునే అవకాశాలపై ఏఏఐ అధ్యయనం పూర్తి చేసిందని, విమానాశ్రయాల విస్తరణకు కావాల్సిన అదనపు భూమికి సంబంధించిన వివరాలను ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి పంపిందని వెల్లడించారు.
భద్రాద్రి వాసులకు బ్యాడ్ న్యూస్
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మాత్రం షాక్ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం, చెంచుపల్లి, సుజాతనగర్ గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన స్థలంలో విమానాశ్రయ నిర్మాణం సాధ్యపడదని స్పష్టం చేశారు. అది విమానాల ల్యాండింగ్ కు, టేకాఫ్ కు ఇబ్బందికరంగా ఉందని, అక్కడ కొండలు, రైల్వే స్టేషన్లు ఉన్నాయని అన్నారు. ఎప్పటినుండో విమానాశ్రయం కోసం ఎదురుచూస్తున్న భద్రాద్రి వాసులకు ఇది బ్యాడ్ న్యూస్.
మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం
ఇప్పటివరకు తెలంగాణా రాష్ట్రానికి ఉడాన్ పథకం క్రింద 58 విమాన మార్గాలు అందుబాటులోకి వచ్చాయని, ఇది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడుతోందని మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications