జంపింగ్.. జపాంగ్: ఆయారాం.. గయారాంలకే వైసీపీలో పెద్దపీట?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికన్నా ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికే పదవులు లభిస్తున్నాయనే అసంతృప్తి వైసీపీ శ్రేణులను తీవ్రంగా వెంటాడుతోంది. 2019లో ప్రభుత్వం ఏర్పడినప్పుడుకానీ, రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రులుగా కొనసాగుతున్నవారుకానీ గతంలో ఇతర పార్టీల్లో ఉండి జగన్‌పై బురద జల్లినవారేనని, కానీ వారికే పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

రేపో మాపో అధికార ప్రకటన
తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాల ఎంపికలో కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నవారికే అన్యాయమే జరుగుతోందని పార్టీ నాయకులు వాపోతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీచేయాల్సి ఉన్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామనే హామీని తీసుకొని బీద మస్తాన్‌రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన్ని ఎంపిక చేశారని, రేపో, మాపో అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నారు.

పార్టీ జెండా మోసినవారికి అన్యాయం
అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఆమె ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తర్వాత పార్టీలో చేరారు. సామాజికవర్గ సమీకరణాల దృష్ట్యా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కబోతోందని వార్తలు వస్తున్నాయి. మరో రెండు స్థానాల్లో ఒకటి విజయసాయిరెడ్డి, మరొకటి అదానీ కుటుంబానికి ఇవ్వబోతున్నారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలంటూ పార్టీలోని అసంతృప్తులు రగిలిపోతున్నారు.

పారిశ్రామికవేత్తలకు ఇస్తే ఇక తామెందుకు?
రాజ్యసభ సీట్లనేవి పారిశ్రామికవేత్తలకే ఇచ్చేస్తుంటే ఇక తామెందుకు పార్టీలో జెండా మోయడం అని, ఇదిగో పదవి, అదిగో పదవి అంటూ ఆశలపల్లకిలో ఊరేగడం ఎందుకని వాపోతున్నారు. అదిగో ఇస్తున్నామంటున్నారుకానీ ఆ సమయానికి ఏదో ఒకటి చెబుతున్నారని, అధినేతపై ఉన్న గౌరవంతోనే తాము ఏమీ మాట్లాడంలేదని చెబుతున్నారు. మొదటి నుంచి పదవిస్తామంటూ ఆశచూపించడం, ఆ తర్వాత వారిని నిరాశకు గురిచేయడం వైసీపీలో సర్వసాధారణంగా మారిపోయిందని, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అప్పుడే నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.