చంద్రబాబు లెక్కే వేరు - వైసీపీ నేత భరత్..!!
ప్రతి సోమవారం పోలవరం అన్న అప్పటి సీఎం చంద్రబాబు,.. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మార్గాని భరత్ ఆక్షేపించారు. సీఎం కనీసం ఏరియల్ సర్వే కూడా చేయలేదని గుర్తు చేశారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నా, సహాయక చర్యల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంత్రులకు సాయం చేయకుండా ఫొటోలకే పరిమితం అయ్యారని విమర్శించారు.
ప్రభుత్వం విఫలం
గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. అదే గతంలో తమ ప్రభుత్వ హయాంలో గోదావరి వరదలు పోటెత్తి.. ముంపునకు గురైన కూనవరం, దేవీపట్నం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టందని, బాధితులను ఆదుకోవడంలో నాటి సీఎం జగన్ వేగంగా స్పందించారని ఆయన గుర్తు చేశారు. బాధితులకు రేషన్‌తో పాటు, పరిహారం కూడా సకాలంలో అందించారని చెప్పారు.

పునరుద్దరించాలి
తమ ప్రభుత్వ హయాంలో గోదావరిలో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తినా, ఆ స్థాయిలో వరద ఉన్నా, తాము బా«ధితులను ఆదుకున్నామని, కానీ ఇప్పుడు 16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, ఈ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం లేదని ఆక్షేపించారు.గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గుతున్నందువల్ల, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ హెచ్చరించారు. అందుకే అధికారులు వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని, ముంపు గ్రామాల్లో వెంటనే రాకపోకలు పునరుద్ధరించాలని కోరారు.
వాలంటీర్లు ఉంటే
ఈ సమయంలో వలంటీర్లు ఉంటే.. బాధితులకు సత్వర సేవలందేవన్న ఆయన, టీడీపీ కూటమి ప్రభుత్వం వారినీ దగా చేసిందని ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు ఒక్కొక్కటిగా ప్రభుత్వం మంగళం పాడుతోందని మార్గాని భరత్ తెలిపారు. తల్లికి వందనం లేదని, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని, ఏటా మూడు ఉచిత సిలిండర్లూ లేవని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కూటమి నేతలు, నాయకులు ఎక్కడికక్కడ ఇసుకాసురులుగా మారారని మార్గాని భరత్ విమర్శించారు.












Click it and Unblock the Notifications