Ysrcp: ఆత్మకూరు లో YCP మెజారిటీ లక్ష??
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జూన్ నెలాఖరులో ఉప ఎన్నిక జరగనుంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరఫున మేకపాటి కుటుంబం నుంచే పోటీచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీచేయడంలేదని ఇప్పటికే స్పష్టం చేసింది. మరణించినవారి నియోజకవర్గంలో వారి కుటుంబ సభ్యులు పోటీచేస్తారు కాబట్టి సానుభూతిగా గతం నుంచే తెలుగుదేశం ఈ పద్ధతి ఫాలో అవుతోంది. జనసేన కూడా పోటీచేయడంలేదని స్పష్టం చేసింది.

ఏకపక్షంగా పోటీచేస్తామని ప్రకటించిన బీజేపీ
ఆత్మకూరు నుంచి తాము పోటీచేస్తున్నామంటూ భారతీయ జనతాపార్టీ ప్రకటించింది. బీజేపీ మిత్రుడిగా ఉన్న జనసేన మద్దతిస్తుందా? లేదా? అనేది ఇంకా తేలలేదు. జనసేనతో సంబంధం లేకుండా, మిత్రపక్షంతో చర్చించకుండా బీజేపీ ఏకపక్షంగా పోటీచేస్తున్నామని ప్రకటించిందికానీ పోటీచేయడానికి ఆ పార్టీకి అక్కడ అభ్యర్థి దొరకడంలేదు.

పోటీ జరగాలని కోరుకుంటున్న వైసీపీ
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పోటీజరగాలనే కోరుకుంటోంది. ప్రభుత్వంపై తీవ్ వ్యతిరేకత వస్తోందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఇక్కడ లక్ష మెజారిటీ సాధించి తమ హవా ఏమీ తగ్గలేదని చాటుకోవాలనే యోచనలో ఆ పార్టీ ఉంది. తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు అని చెప్పుకోవడానికి ఈ ఉప ఎన్నికల, లక్ష మెజారిటీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

హైకమాండ్ అనుమతి ఉందా? లేదా?
భారతీయ జనతాపార్టీ అభ్యర్థి కోసం వేటలో ఉంది. కానీ ఢిల్లీ నుంచి హైకమాండ్ మాత్రం ఇక్కడ పోటీకి అనుమతిచ్చిందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం పోటీకి సిద్ధపడుతున్నారు. చివరి నిముషంలో బీజేపీ కూడా పోటీ వద్దంటే ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని, అప్పుడు వైసీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications