జనసేన, టీడీపీ కలిసి పనిచేసే పరిస్థితి లేదు; జగన్ పైనా వైసీపీ ఎమ్మెల్యే విసుర్లు!!
కాకినాడ జిల్లా జగ్గంపేట రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. జగ్గంపేట వైసిపి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నిన్న రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనతో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆయన జనసేన వైపు చూస్తుండటం స్థానికంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వైసిపి నుండి టికెట్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు రావడంతో ఆయన టిడిపి, జనసేన వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదట టిడిపిలోకి వెళ్లాలని ప్రయత్నించిన జ్యోతుల చంటిబాబు, నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తో రహస్యంగా భేటీ అయ్యారు.

అయితే ఈ భేటీ పై వార్తలు రావడంతో తాజాగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సమావేశంపై అనుచరులతో మాట్లాడిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని పిలిచారని, అందుకే తాను వెళ్లి మాట్లాడానని తెలిపారు.
ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ తనను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్న ఆయన జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సర్వేల ఆధారంగా సీటు కేటాయించడానికి అసలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చేసింది ఏమీ లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గాలలో ఏ పని చేసినా ప్రభుత్వపరంగా జరిగినవే అని ఆయన పేర్కొన్నారు. తనను కాదని వైసిపి సీటు ఇస్తున్న వారు పనికొచ్చే వారేనా అంటూ ఆయన ప్రశ్నించారు. జగ్గంపేటలో టిడిపి, జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి.
వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కలిసి పోటీ చేసి వైసీపీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సర్దుబాటు విషయంలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.












Click it and Unblock the Notifications