వైసీపీ ఫ్యాన్‌కు మూడు రెక్కలు, రాజధాని మూడు ముక్కలు, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీకి మూడు రెక్కలు ఉంటాయని, అలాగే రాజధానిని మూడు ముక్కలు చేయాలని ఆయన భావిస్తున్నారని విమర్శించారు. ఆ మూడు ముక్కల్లో సంస్థానాలను ఏర్పాటు చేసి, దోచేయాలని జగన్ భావిస్తున్నారని యనమల ఆరోపించారు. అక్కడ ఆస్తులను పెంచుకునే ప్రయత్నమే రాజధాని ఏర్పాటు అని మండిపడ్డారు.

కుట్రకోణం..
విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించాలని ఎవరు అడిగారు అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అడగకముందే క్యాపిటిల్ సిటీ ప్రకటించడంలో మర్మం ఏముంది అని అడిగారు. అడిగినా చేయని సీఎం జగన్.. అడగకముందే రాజధాని ప్రకటన చేయడమంటే.. ఇందులో ఏదో కుట్ర దాగుందని చెప్పారు. సంపద సృష్టించేందుకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని వివరించారు. కానీ జగన్ మాత్రం సంపద పెంచుకోవడానికే రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు.

ధరలు ఎక్కువ అని..
సీఎం జగన్ తన సంపద ఎలా పెంచుకోవాలో బాగా తెలుసని చెప్పారు. కానీ రాష్ట్ర సంపద పెంచాలని మాత్రం ఇసుమంతైనా లేదన్నారు. అమరావతి ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతుంది, అదే విశాఖ అయితే డెవలప్ అయిన ప్రాంతం అని చెప్పారు. వైజాగ్‌లో భూముల ధరలు ఎక్కువని, భూములను కబ్జా చేసేందుకు రాజధాని మార్పు అనే నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల మార్క్ రాజకీయాలు ఇక్కడి ప్రజలకు తెలుసునని గుర్తుచేశారు. అందుకే గత ఎన్నికల్లో విజయమ్మను ఓడించారని పేర్కొన్నారు.

భూములపై కన్ను
విశాఖపట్టణం ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతం అని యనమల రామకృష్ణుడు అన్నారు. ఎస్ఈజెడ్ వచ్చాయని.. ఫార్మాసిటీ ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. ఇక్కడి భూములపై కన్నేసిన సీఎం జగన్ ఎలాగైనా భూకబ్జా చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు.

పనులెందుకు ఆపారు..
పోలవరం ఎడమకాలువ పనులను ఎందుకు ఆపివేశారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోరా అని నిలదీశారు. ఉత్తరాంద్ర ప్రాంత ప్రజలను నష్టానికి గురిచేసి, రాజధాని పేరుతో నాటకాలు ఆడుతారా అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications