వైసీపీకి బిగ్ షాక్.. 24 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన , బీజేపీ కూటమిగా ఏర్పడి , ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కూటమి ఏకంగా 164 సీట్లలో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది.

పార్టీ ఓడిపోవడంతో నేతలు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కేశినేని నాని, రావేల కిషోర్ బాబు, అలీ వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా చిత్తూరు జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 24 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన కార్పొరేటర్లు తాము టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

అయితే కార్పొరేటర్లు పార్టీ మారడంపై జిల్లా అధ్యక్షుడు భరత్ సీరియస్ అయ్యారు. టీడీపీలో చేరిన కార్పొరేటర్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు భరత్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరికొంతమంది వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications