పవన్ కల్యాణ్ కు ప్రధాని చెప్పింది ఇదే : పొలిటికల్ పిక్చర్ క్లియర్..!!
ప్రధాని మోదీతో జనసేనాని భేటీలో ఏం జరిగింది. పవన్ కు ప్రధాని ఏం చెప్పారు. ఇప్పుడు ఈ అంశం పైన బీజేపీ -జనసేన నుంచి క్లారిటీ వస్తోంది. ఏపీలో రాజకీయంగా కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రధాని విశాఖ పర్యటన తరువాత ఒక్క సారిగా రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ.. ప్రధాని పర్యటన మొత్తం సమీకరణాలనే మార్చేసింది. విశాఖ పర్యటన తరువాత విజయవాడలో పవన్ బస చేసిన హోటల్ కు వెళ్లి స్వయంగా చంద్రబాబు కలిసారు.
ప్రధానితో భేటీతో కొత్త వ్యూహాలు
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. దీంతో, రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని అంచనాకు రెండు పార్టీల నేతలు వచ్చారు. పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ ఏపీకి సంబంధించి తన ఆలోచనలను సూచన ప్రాయంగా షేర్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానితో భేటీ తరువాత పవన్ ఇక బీజేపీతో మాత్రమే పొత్తులో కొనసాగుతారని కమలం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో తాము కలిసేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. టీడీపీతో పవన్ పొత్తుతో వెళ్లటం ద్వారా టీడీపీ ఇచ్చే సీట్లలో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది.. గెలిచినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ బీజేపీ నేతలు పవన్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

బీజేపీ - జనసేన కూటమి సీఎం అభ్యర్ధిగా
బీజేపీ -జనసేన కూటమిగా ముందుకెళ్తే పవన్ సీఎం అభ్యర్ధిగా బరిలో ఉంటారని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పరోక్షంగా ప్రధాని భేటీలోనూ ఇవే సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ నేతల సమాచారం. బీజేపీ - జనసేన కలిసి బలమైన కూటమిగా ఎదగటం ద్వారా..ఇతర పార్టీల నుంచి వలసలు కూడా పెరుగుతాయని బీజేపీ నేతలు వివరించినట్లుగా తెలుస్తోంది. జనసేన మద్దతు లేకుండా టీడీపీ ముందుకెళ్లే పరిస్థితి లేదనే అంచనాతో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో, పవన్ కల్యాణ్ మరోసారి టీడీపీతో జత కట్టకుండా చూసినట్లయితే, భవిష్యత్ లో తమ రెండు పార్టీలది కీలక పాత్ర అవుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రధానితో భేటీ సమయంలోనూ.. బీజేపీతో కలిసి .. రెండు పార్టీలు బలోపేత దిశగా అడుగులు వేయాలనే సంకేతాలు పవన్ కు అందాయని చెబుతున్నారు. దీని కారణంగానే ఇప్పుడు టీడీపీ వైపు జనసేనాని ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందనేది పార్టీ నేతల విశ్లేషణ.

పవన్ - టీడీపీ తో కలవరంటున్న బీజేపీ
ప్రధాని మోదీ ఇచ్చిన సంకేతాలు.. సూచనలకు పవన్ కల్యాన్ అంగీకరించటంతోనే..ఆ తరువాత ప్రధానిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేసారని కమలం నేతలు చెప్పుకొస్తున్నారు. కేంద్రంలో బీజేపీ బలంగా ఉందని.. ఏపీలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలనేది ప్రధాని మోదీ - పవన్ భేటీ సారాంశంగా వెల్లడిస్తున్నారు. పరోక్షంగా బీజేపీ - జనసేన కూటమి బలోపేతమే ఇప్పుడు పవన్ ముందున్న టాస్క్ గా చెబుతున్నారు. టీడీపీకి మద్దతిచ్చి సీఎం చేయటం కంటే..బీజేపీతో ఉండి సీఎం అవ్వాలంటూ బీజేపీ నేతలు పదే పదే పవన్ కు సూచిస్తున్నారు. అదే పవన్ కల్యాణ్ విజయనగరం పర్యటనలోనూ స్పష్టమైందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో, మరి పవన్ కల్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ పైన ఎలాంటి స్పష్టత ఇస్తారనేది కీలకంగా మారుతోంది. అదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications