వివేకా కుమార్తె సునీతపై అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఏపీలో ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్యపై ఇప్పటి వరకూ సీబీఐ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబడుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి నిత్యం కడప ఎంపీ అభ్యర్ధి వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే ఆయనకు పోటీగా నిలబడిన వైఎస్ షర్మిలకు మద్దతుగా ఓటయాలని కోరుతున్నారు. తాజాగా వివేకా హత్యలో అవినాష్ పాత్రపై సునీత మరిన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు.
దీనిపై ఇవాళ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వివేకా హంతకుడు దస్తగిరిని అప్రూవర్ గా మార్చి ఆయనతో కుమ్మక్కై సునీత ఎన్నికల వేళ తనపై రాజకీయంగా బురదజల్లుతున్నారని అవినాష్ ఆరోపించారు. గతంలో వివేకాను హత్య చేసినట్లు దస్తగిరి అంగీకరించినా ఆయన్ను సాక్షిగా మార్చేందుకు సునీత ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. సునీతతో చేసుకున్న ఒప్పందం కారణంగానే దస్తగిరి అప్రూవర్ గా మారాడని అవినాష్ ఆరోపించారు.

గతంలో వివేకా హత్యపై సీబీఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన సునీతారెడ్డి, ఆ తర్వాత వివేకా రాసిన లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకున్నట్లు అవినాష్ రెడ్డి ఆరోపించారు. సునీత మేనమామ శివప్రకాష్ రెడ్డిని ఈ కేసులో మూడో వ్యక్తి అనడాన్ని అవినాష్ తప్పుబట్టారు. వివేకా హత్యపై ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసింది శివప్రకాష్ రెడ్డేనన్నారు. హత్య తర్వాత వాళ్లు ఫోన్ చేస్తేనే ఎర్ర గంగిరెడ్డి అక్కడికి వచ్చారన్నారు. వివేకాను చివరి రోజుల్లో సునీత దుర్భర పరిస్దితుల్లోకి నెట్టారని, చివరికి చెక్ పవర్ కూడా రద్దు చేశారన్నారు.












Click it and Unblock the Notifications