గూగుల్ కు వైఎస్ భారతి వార్నింగ్, వాళ్లందరికీ లీగల్ నోటీసులు
రాజకీయ వైషమ్యాలతో వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సోషల్ మీడియా దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.. వైఎస్ భారతీరెడ్డి న్యాయపరమైన చర్యలు చేపట్టారు. తన పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిగత గోప్యతను హరించేలా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలతో పాటు పలు వెబ్ పోర్టల్స్‌కు ఆమె తరఫు న్యాయవాది హెచ్చరికలతో కూడిన లీగల్ నోటీసులు జారీ చేశారు.
భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్ కైస్తా ఈ లీగల్ నోటీసులను పంపారు. మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ కార్పొరేషన్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్ సంస్థలకు పంపిన ఈ నోటీసుల్లో.. తన క్లయింట్‌పై ఉన్న తప్పుడు కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని కోరారు. అలాగే, నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న 'థింక్ ఆంధ్ర', 'M9 (మిర్చి 9) న్యూస్' సంస్థలకు కూడా నోటీసులు అందాయి.

ప్రణాళికాబద్ధమైన కుట్ర!
రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్స్ కావాలనే పథకం ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని నడిపిస్తున్నాయని నోటీసుల్లో ఆరోపించారు. రాజకీయ విమర్శలు కాకుండా, కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 'థింక్ ఆంధ్ర' రూపొందించిన ఒక వీడియో పూర్తి అవాస్తవమని, దానిని ఐటీ సెల్స్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని న్యాయవాది ధ్వజమెత్తారు.
డిమాండ్లు ఇవే..
లీగల్ నోటీసుల ద్వారా వైఎస్ భారతీరెడ్డి ప్రధానంగా మూడు డిమాండ్లను ముందుంచారు:
- తక్షణ తొలగింపు: భారతీరెడ్డికి అపకీర్తి కలిగించే విధంగా ఉన్న అన్ని పోస్టులు, వీడియోలు, స్ట్రీమింగ్ కంటెంట్‌ను సోషల్ మీడియా సంస్థలు వెంటనే తొలగించాలి.
- అకౌంట్ల బ్లాక్: పదేపదే తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను శాశ్వతంగా బ్లాక్ చేయాలి.
- బేషరతు క్షమాపణ: అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు సంబంధిత సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో, సివిల్ - క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయవాది హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమని భారతీరెడ్డి ఈ నోటీసుల ద్వారా స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications