పదో తరగతి పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్..
ఈ ఏడాది ఏపీలో పదో తరగతి పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఈ ఏడాది పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు కచ్చితంగా మేలు జరగబోతోందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే మూల్యాంకనంలో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఏపీలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే ఈ నెల 19 నుంచి 26 వరకూ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ జరగనుంది. ఇందులో ఈసారి విద్యార్ధులకు మేలు చేసేగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం నిర్ణీత ప్రశ్నల కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలనే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫున పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నలకు రాసిన సమాధానాల్ని పరిగణనలోకి తీసుకోరు.

అలాగే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూల్యాంకనంలో భాగంగా రోజుకు కేవలం 40 ప్రశ్నాపత్రాల్ని మాత్రమే దిద్దాలని ఆదేశించారు. అలాగే అసిస్టెంట్ ఎగ్జామినర్లు చేసే మూల్యాంకనాన్ని స్పెషల్ ఎగ్జామినర్లు పూర్తిగా పరిశీలించి మార్కులు లెక్కించాలి. అభ్యర్ధులు నిర్ణీత ప్రశ్నల కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాశారో లేదో కూడా వీరు గమనించాలి. అలాగే వాటిలో ఎన్నింటికి మార్కులు వేశారో పరిశీలించాలి.
వీటికి అసిస్టెంట్ ఎగ్జామినర్ ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకున్నారో లేదో చూడాలని సూచించారు.
ఈసారి పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రీకౌంటింగ్, వెరిఫికేషన్ కు అవకాశం లేకుండా మూల్యాంకనం చేయాలి, తప్పిదాలు దొర్లితే మాత్రం అసిస్టెంట్, స్పెషల్, ఛీఫ్ ఎగ్జామినర్లపై పెనాల్టీతో పాటు క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎలాగో డీఈవోలను కూడా ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications