YS Jagan : కాంట్రాక్టు ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్-ఆ రూల్ కూడా సడలింపు..!
ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకునేందుకు సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి షరతుల్లేకుండా క్రమబద్ధీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే క్రమబద్ధీకరణ కోసం విధించిన ఐదేళ్ల నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇది స్వాతంత్ర దినోత్సవ కానుక కాబోతోంది.
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే 2014, జూన్ 2 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయాలని గత క్యాబినెట్ లో తీర్మానం చేశారు. దీంతో ఐదేళ్ల సర్వీసు పూర్తి కాని వారికి మాత్రం ఉద్యోగులు క్రమబద్ధీకరించే అవకాశం లేకుండా పోయింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేసింది.

వీలైనంత ఎక్కువమందిని రెగ్యులర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఏ సంఘం డిమాండ్ చేయకపోయినా స్వయంగా ముఖ్యమంత్రే ఐదేళ్ల సర్వీసు నిబంధన తొలగించి 2014 జూన్, 2 ముందు నియమంచబడి ఇప్పటివరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి జగన్ నిన్న స్వాతంత్ర్య దినోత్సవం రోజే సంతకం చేశారని వెల్లడించాయి.
కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ నిన్న నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరో 4-5 రోజుల్లోన్ే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేస్తాం అని ఎన్నికలలో చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు చేసిన సీఎం జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications