కార్పోరేషన్లపై కన్నేసిన జగన్?: వైసీపీకి చెడ్డపేరు, 500 ఎకరాలపై అందోళన
అమరావతి: త్వరలో ఏపీలో జరగనున్న కార్పోరేషన్ ఎన్నికలపై వైసీపీ అధినేత వైయస్ జగన్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇంఛార్జిలను నియమించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు చెప్పారు.
ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని 9 జిల్లాల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సూచించారని అన్నారు. ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని, పార్టీ కేడర్ అంతా సమిష్టిగా పనిచేయాలని జగన్ చెప్పారని కన్నబాబు తెలిపారు.
ఇందులో భాగంగానే కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు ఇంఛార్జిలను నియమించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 11న వైసీపీ మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలను ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. సేవా ధృక్పథం, మంచిపేరు, విధేయత కలిగినవారికే అభ్యర్థులుగా ప్రాధాన్యమివ్వాలని జగన్ చెప్పారని వెల్లడించారు.

కాగా, తుని ఘటనకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని కన్నబాబు స్పష్టం చేశారు. ఏ సంబంధం లేని తమ నేతలను సీఐడీ అధికారులు పిలిచి విచారణ చేస్తున్నారని, ఇదంతా ఒక గందరగోళం సృష్టించి వైసీపీపై బురద జల్లేందుకు ప్రభుత్వ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.
కాపు రిజర్వేషన్‌ను నీరు గార్చే పనిలో అధికార పార్టీ ఉందని ఆయన తెలిపారు. తుని ఘటన సాకుతో వైసీపీకి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడ వేస్తోందని, అది ఎన్నటికీ జరగదని, ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలను సహించరని ఆయన హెచ్చరించారు.
'తొలుత రాయలసీమ వారు దాడి చేశారన్నారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లావారిని అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు నిద్రపోయేవారిని కూడా వదలకుండా స్టేషన్లకు పిలిపించి వేధించారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల ద్వారా ప్రజలను ఏమైనా చేయగలమనే భ్రమల్లో టీడీపీ ఉంది' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి మండలం కొత్తపాకల దగ్గర దివిస్ కంపెనీ ఏర్పాటుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు తీసుకుని దివిస్ కంపెనీకి అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 5లక్షలు మాత్రమే చెల్లించి ఎంతో విలువైన 500 ఎకరాలు భూమిని దివిస్ ల్యాబ్‌కు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు.
ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా భూములకు నష్టపరిహారం ఇస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో పొలీస్ రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. కాపు రిజర్వేషన్ విషయంలో వేసిన మంజునాథ కమిషన్ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని, అసలు ఇస్తుందో ఇవ్వదో తెలియదని అన్నారు.
కాపు రిజర్వేషన్ కోసం ఏర్పాటైన మంజునాథ కమిషన్ సభ్యులకు ఇప్పటి వరకు ఒక కుర్చీ కూడా ఇవ్వలేదంటే ప్రభుత్వం ఆ విషయంపై ఎంత సీరియస్ ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications