రైతుల మోటార్ల మీటర్లకు రూపాయి కూడా తీసుకోం... అసెంబ్లీలో జగన్ హామీ
ఏపీలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్ధాయిలో ఫలించడం లేదు. దీనికి కారణం రైతుల్లో నెలకొన్న అనుమానాలే. ఉచిత విద్యుత్ ఇస్తున్న వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించిన తర్వాత బిల్లులు పంపుతారన్న ఆందోళన రైతుల్లో ఉంది. దీంతో ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది.
రైతుల విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై ఉన్న అనుమానాల్ని సీఎం జగన్ అసెంబ్లీలో నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. వ్యవసాయంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం జగన్ ప్రసంగించారు. మోటార్లకు మీటర్ల విషయంలో ఒక్క రూపాయి తీసుకోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్ల బిగింపు విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని విపక్షాలకు సూచించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నుంచి రూపాయి కూడా వసూలు చేయలేదని సీఎం తెలిపారు. మోటార్లకు మీటర్ల వల్ల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో రైతుల విద్యుత్ మోటార్లు కాలిపోయే స్థితి నుంచి రైతులను కాపాడుతామని సీఎం జగన్ వెల్లడించారు. నాణ్యత లేకపోతే రైతు నష్టపోతాడని ఆయన తెలిపారు. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని జగన్ పేర్కొన్నారు. ఏపీలో 10,775 ఆర్బీకేలను ఏర్పాటు చేశామన్నారు. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ ఆర్బీకేలను ప్రశంసించాయని సీఎం గుర్తుచేశారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఒక్క మండలంలోనూ కరవు లేదని, ఈ మూడేళ్లలో సీమకు అత్యధికంగా నీళ్లు ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications