హరికృష్ణని ఓదార్చిన జగన్, బాలకృష్ణ: లక్ష్మీపార్వతి దిగ్భ్రాంతి
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరాం మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆదివారం మాసాబ్ ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి వెళ్లిన జగన్ జానకిరాం మృతదేహానికి నివాళులర్పించారు.
అనంతరం ఆయన హరికృష్ణ కుబుంట సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ వెంట ఆయన పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హరికృష్ణ నివాసానికి వెళ్లారు. హీరో, హిందుపూరం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.

మాసాబ్ ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి వెళ్లిన బాలకృష్ణ... జానకిరాం మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన తన సోదరుడు హరికృష్ణను ఓదార్చారు. జానకిరాం మృతి నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హరికృస్ణ నివాసానికి చేరుకుని ఆ కుటుంబాన్ని ఓదార్చుతున్నారు.
జానకిరాం మృతదేహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను ఏం మాట్లాడలేకపోతున్నానని, చాలా బాధగా ఉందని చెప్పారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో జానకిరాంను ఈ కుటుంబంలోకి మళ్లీ తీసుకు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. హరికృష్ణకు, జానకిరాం భార్య కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆమె హరికృష్ణను ఓదార్చారు.
జానకిరాం మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివార ఉదయం జానకిరాం భౌతికకాయాన్ని పలువురు సందర్శించారు. జగన్, లక్ష్మీ పార్వతి, కొడాలి నాని, సినీ నిర్మాత సురేష్ బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకులు రాఘవేంద్ర రావు తదితరులు హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications